ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఆదివారం అర్ధరాత్రి గంజివారిపల్లెకు చెందిన మందా మరియమ్మకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. 108కు ఫోన్ చేయగా సమాధానం రాలేదు. దాంతో గర్భిణిని ఆటోలో యర్రగొండపాలెం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. నలుగురు వైద్యులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. ఎవరూ కనిపించలేదు. ఇద్దరు నర్సులు, సిబ్బంది మాత్రమే ఉన్నారు. నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆసుపత్రిలో చేర్చుకోలేదు. పైగా బయటకు పంపేశారు.
అమానుషం.. కనికరించని వైద్యులు.. రోడ్డుపైనే ప్రసవం - taja news of prakasam dst corona
ఆమె నిండు గర్భిణి. పురిటి నొప్పులను పంటిబిగువన పెట్టుకుంది. 108 వాహనం రాకపోతే... ఆటోలోనే ఆసుపత్రికొచ్చింది. అక్కడి సిబ్బంది ఆసుపత్రిలోకి రానీయకుండా అమానవీయంగా ప్రవర్తించారు.
ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లేందుకు ఆటోలో ఎక్కిస్తుండగా నొప్పులు తీవ్రమయ్యాయి. సాయం చేయాలని నర్సులు, సిబ్బందిని వేడుకున్నా... వారు కనికరించలేదు. దాంతో తోటి మహిళలే కాన్పు చేశారు. బిడ్డ జన్మించగా.. బొడ్డు కత్తిరించేందుకు కత్తెర ఇవ్వాలని ప్రాధేయపడినా.. వారు వినిపించుకోలేదు. ఈ విషయంపై ప్రభుత్వాసుపత్రి బాధ్యుడు డాక్టర్ పాల్‌ను వివరణ కోరగా.. ఇటీవల ఓ గర్భిణికి శస్త్రచికిత్స చేసి కాన్పు చేశామని తెలిపారు. ఆ తరువాత ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అప్పటి నుంచి ఎవరినీ అనుమతించడం లేదని పేర్కొన్నారు.