Power Holiday in AP: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలపై పిడుగు పడింది. ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి నుంచి పవర్ హాలిడే ప్రకటించింది. పరిశ్రమలు వారాంతపు సెలవుకు అదనంగా మరోరోజు సెలవు ప్రకటించుకోవాలని.. నిరంతరాయంగా పనిచేసే (24 గంటలూ) పరిశ్రమలు కూడా తమ అవసరాల్లో 50 శాతం విద్యుత్ మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపనుంది. మళ్లీ 2014 ముందు నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కార్మికుల ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున దెబ్బతీయనుంది.
పూట గడిచేదెలా..:అసలే పెట్టుబడులు రావడం లేదు, కొత్త పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. ఉన్న పరిశ్రమలు కూడా ప్రస్తుత విద్యుత్ వాడకంలో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో.. కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్ కారణంగా రెండేళ్లపాటు పారిశ్రామికరంగం కుదేలైంది. కార్మికులూ ఉపాధి కోల్పోయారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయనుకునే సమయంలో.. ప్రభుత్వం పవర్ హాలిడే ప్రకటించింది. ఉపాధి పోతే పూట గడిచేదెలా? అని కార్మికులు కలవరపడుతున్నారు. నిర్దేశించిన సమయానికి ఉత్పత్తుల్ని సిద్ధం చేయలేకపోతే.. తీవ్రంగా నష్టపోతామని అప్పులు తెచ్చి రూ.కోట్లలో పెట్టుబడి పెట్టిన పరిశ్రమల యజమానులు వణికిపోతున్నారు.
ఫెర్రో కంపెనీలకు పవర్ హాలిడే ప్రకటన పెద్ద దెబ్బగా మారనుంది. అచ్యుతాపురం సెజ్‌లో మూడు ఫెర్రో కంపెనీలు ఉండగా ఆసియాలోనే అతిపెద్ద ఫెర్రో పరిశ్రమ అయిన అభిజీత్ ఉత్పత్తులను కొనసాగిస్తోంది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 54 ఫెర్రో పరిశ్రమలకు విద్యుత్ అవసరం అధికంగా ఉంటుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని 180 పరిశ్రమలతో పాటు, పరవాడ ఫార్మాసిటీలోని 45 పరిశ్రమలపై పవర్‌హాలిడే ప్రభావం పడనుంది. ప్రత్యక్షంగా కంపెనీల్లో పనిచేసే కార్మికులు, పరోక్షంగా అనుబంధ విభాగాలపైనా పడనుంది. ఇప్పటికే కొవిడ్‌తో రెండేళ్లుగా ఉత్పత్తులు నిలిచిపోయి తీవ్రంగా నష్టపోయామని పరిశ్రమల యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయి. ఒకవైపు పెరిగిన డీజిల్ ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపుతో ఆందోళన చెందుతున్న పరిశ్రమలపై.. ప్రభుత్వం పవర్ హాలిడే ప్రకటన మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
- దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని 253 నిరంతర ప్రాసెసింగ్ పరిశ్రమలు తమ రోజువారీ విద్యుత్ వినియోగంలో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. 1,696 ఇతర పరిశ్రమలకు ప్రస్తుతం అమల్లో ఉన్న వారాంతపు సెలవుకు అదనంగా ఒకరోజు పవర్ హాలిడే అమలు చేయనున్నారు.
- ఎస్పీడీసీఎల్ పరిధిలో చిత్తూరు జిల్లాలోని పరిశ్రమలకు శుక్రవారం పవర్ హాలిడే అమలు చేయనున్నట్లు సీఎండీ హరనాథరావు తెలిపారు. పుత్తూరు మినహాయించి మిగిలిన అన్ని డివిజన్లలోనూ ఇది అమలవుతుందని తెలిపారు.
40 నుంచి 50 మిలియన్ యూనిట్ల కొరత..: ‘రాష్ట్రంలో రోజుకు 40 నుంచి 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడింది. దేశవ్యాప్తంగా సరిపడా విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో.. రాష్ట్ర అవసరాలకు తగినంత కొనలేకపోతున్నాం. దేశవ్యాప్తంగా పంటల ముగింపు కాలం, వడగాలుల కారణంగా ఎక్స్ఛేంజీలోనూ విద్యుత్ అందుబాటులో లేదు. పంట కోతలు ముగిసిన తర్వాత వచ్చే 15 రోజుల్లో డిమాండ్ తగ్గే అవకాశం ఉంది’ అని ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. గృహ, వ్యవసాయ అవసరాలకు సరఫరాలో ఆటంకం లేకుండా చూసేందుకు పరిశ్రమలకు సరఫరాను నియంత్రించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు.