తెలంగాణ

telangana

ETV Bharat / city

పెరిగిన విద్యుత్ డిమాండ్.. అంధకారంలో పట్టణాలు, పల్లెలు ! - ఏపీ కరెంటు కోతలు

power cuts in ap: ఏపీలో పెరిగిన విద్యుత్ వినియోగానికి తగ్గట్లుగా సరఫరా చేయలేని పరిస్థితి తలెత్తడంతో కోతలు ఎక్కువయ్యాయి. అనధికార విద్యుత్‌ కోతలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. బుధ, గురువారం రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. నిద్ర లేని రాత్రులు గడిపారు. అదనంగా ఎంత విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నా.. అదనపు లోడ్‌ సర్దుబాటులో సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.

పెరిగిన విద్యుత్ డిమాండ్.. అంధకారంలో పట్టణాలు, పల్లెలు !
పెరిగిన విద్యుత్ డిమాండ్.. అంధకారంలో పట్టణాలు, పల్లెలు !

By

Published : May 27, 2022, 8:22 AM IST

power cuts in ap: ఏపీలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. దీంతో అనధికార విద్యుత్ కోతలు మళ్లీ వచ్చాయి. బుధవారం రాత్రి గంటల తరబడి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. ఉష్ణోగ్రతలూ పెరగడంతో ఉక్కపోతతో తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. బుధవారం 198.21 మిలియన్ యూనిట్లు డిమాండ్ ఉంటే.. దీనికి అనుగుణంగా సరఫరా చేయలేక అత్యవసర లోడ్ సర్దుబాటు పేరిట 5.68 మిలియన్ యూనిట్ల మేర కోత విధించాల్సి వచ్చింది. దీని వల్ల మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో బుధవారం రాత్రి అంధకారం నెలకొంది. మున్సిపాలిటీల్లో అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల తర్వాత సరఫరా పునరుద్ధరించినా.. గ్రామాల్లో గురువారం తెల్లవారుజాము వరకూ సరఫరా చేయలేదు. అంచనాల మేరకు పవన విద్యుత్ రాకపోవడం, థర్మల్ యూనిట్లలో సాంకేతిక లోపం కారణంగా ఉత్పత్తి తగ్గడంతో అత్యవసర లోడ్‌ సర్దుబాటుకు కోతలు విధించాల్సి వచ్చిందని అధికారుల చెప్పారు.

గురువారం రాత్రి కూడా పలు పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 190 నుంచి 200 మిలియన్ యూనిట్ల మధ్య ఉండే అవకాశం ఉందనేది అధికారుల అంచనా. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరుల ద్వారా వచ్చే విద్యుత్ సరిపోతుందని భావించారు. ఈ మేరకు పరిశ్రమలకు విధించిన విద్యుత్ విరామాన్ని దశల వారీగా తొలగించారు. బుధవారం డిమాండ్‌ 198.21 మిలియన్ యూనిట్లు ఉన్నా.. దీనికి అనుగుణంగా సరఫరా చేయడం డిస్కంలకు సాధ్యపడలేదు. థర్మల్ విద్యుత్‌ 84.36 మిలియన్‌ యూనిట్లు, జల విద్యుత్‌ 6.49, పవన విద్యుత్ 22.93, సౌర విద్యుత్ 14.08, ఇతర వనరుల నుంచి.. 5.73, కేంద్ర ఉత్పత్తి సంస్థ నుంచి 48.62 మిలియన్‌ యూనిట్లు గ్రిడ్‌కు అందాయి. ఎక్స్‌చేంజీల నుంచి 6.73 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను డిస్కంలు కొన్నాయి. జాతీయ గ్రిడ్‌ నుంచి అన్‌ షెడ్యూల్డ్‌ ఇంటర్ ఛేంజ్‌ కింద 3.59 మిలియన్ యూనిట్లు అదనంగా తీసుకున్నా ఇంకా 5.68 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడింది.

కర్ణాటకలోని కూడ్గి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి కొనుగోలు ఒప్పందాల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన 240 మెగావాట్లలో కేవలం 80 మెగావాట్లే వస్తోంది. కృష్ణపట్నంలో 800 మెగావాట్ల యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం ఉత్పత్తి నిలిచిపోయింది. మరో యూనిట్ నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తి రావడం లేదు. మంగళవారం సగటున 321, బుధవారం 316 మెగావాట్లే వచ్చింది. పవన విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు నిలిచిపోతుందో అంచనా వేయడం కష్టంగా ఉందని అధికారులు అంటున్నారు. కోతలకు పవన విద్యుత్తే కారణమని చెబుతున్నారు.

ఇదీ చదవండి:సీఎం కేసీఆర్​ రాలేగావ్ సిద్ధి పర్యటన వాయిదా

ముక్కు కొలతల ఆధారంగా ఆర్య, ద్రావిడ విభజన చేసిన ఆంగ్లేయులు

ABOUT THE AUTHOR

...view details