ఈ నెల 21 వరకు మీడియాతో మాట్లాడవద్దని ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మంత్రి కొడాలి నాని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇరువురి వాదనలపై సంతృప్తి చెందని న్యాయమూర్తి ఓ సీనియర్ న్యాయవాదిని అమికస్ క్యూరీగా నియమిస్తామని తెలిపారు. తదుపరి విచారణను బుధవారం వరకు వాయిదా వేశారు.
మంత్రి కొడాలి నాని ఎస్ఈసీ, కమిషనర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 12 వీడియోలను ధర్మాసనం ముందు ప్రదర్శించారు. న్యాయమూర్తి వీడియోలను పరిశీలించారు. మంత్రి అనుచితంగా ఎస్ఈసీపై వ్యాఖ్యలు చేసినందుకే మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించామని .. కేసు నమోదు చేయాలని జిల్లా గ్రామీణ ఎస్పీని ఆదేశించినట్లు ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎస్ఈసీకి వివరణ ఇచ్చినా.. పట్టించుకోకుండా ఆదేశాలు జారీ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.