కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల పాదాల చెంతనున్న దివ్య ప్రదేశం అలిపిరి. ఏపీలోని తిరుమల కొండపైకి వెళ్లేందుకు మార్గం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందనే దానిపై భిన్న కథనాలున్నాయి. తమిళులు కొండ దిగువభాగాన్ని ‘అడివారం’ అంటారు. మొదటిమెట్టును ‘అడిపడి’ అంటారు. ఈ పేర్లే కాలక్రమంలో అలిపిరిగా మారాయని చెబుతారు. వైష్ణవంలో చింతచెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తిరుమలలో స్వామివారు చింతచెట్టు కిందే వెలిసినట్లు చెబుతారు. నమ్మాళ్వారు చింతచెట్టు తొర్రలో చాలాకాలం గడిపారు. పూర్వం తిరుమల గిరుల పాద భాగంలో పులి అనే చింతచెట్టు ఉండడం వల్ల అడిపులి అనే పేరు ఏర్పడింది. అది కాలక్రమంలో అలిపిరి అయిందని అంటారు.
పూర్వం తిరుమల కొండ ఎక్కలేనివారు కపిల తీర్థంలోని ఆళ్వారు తీర్థం దగ్గర తలనీలాలు సమర్పించి, అక్కడే స్నానం చేసి అలిపిరి పాదాలవద్ద నుంచే స్వామికి నమస్కరించి వెళ్లేవారు. కొండ ఎక్కేందుకు అనుమతి లేనివారు కూడా ఇలాగే చేసేవారు. అప్పటి నుంచి అలిపిరిలో సాష్టాంగ నమస్కారాలు చేయడం ఆనవాయితీ అయింది.
* సాలగ్రామ శిలామయమైన తిరుమల కొండను పాదాలతో తొక్కకూడదని రామానుజాచార్యులవారు చాలాకాలం పాటు అలిపిరి నుంచే స్వామివారిని సేవించుకునేవారు. తర్వాత కాలంలో ఆయన మోకాళ్లపై తిరుమలకు వెళ్లినట్లు చరిత్రలో ఉంది.