Telangana Rain Updates : కుంభవృష్టి వానలు ఆగడం లేదు. రాష్ట్రంలో బుధ, గురువారాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున వీటి ప్రభావంతో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొద్దిగంటల్లోనే కారుమేఘాలేర్పడి భారీవర్షాలు కురుస్తాయని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Telangana Weather Updates : రాష్ట్రంలో మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు 50 ప్రాంతాల్లో ఒక్కోచోట 10 సెంటీమీటర్లకు పైగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా జైనూరు గ్రామం (కుమురం భీం)లో 17.9 సెం.మీ., ఆమకొండ (కరీంనగర్)లో 17.8, కనుకుల (పెద్దపల్లి)లో 17.7, ఆదిలాబాద్ జిల్లా హీరాపూర్‌లో 16.8, పిప్పల్‌ధరిలో 15.6, వెదురుగట్టు (కరీంనగర్)లో 15.4, గుళ్లకొండ (జగిత్యాల)లో 15.4, చెల్పూరు(జయశంకర్)లో 14.2, పెంబి (నిర్మల్)లో 14.3 సెం.మీ. వర్షం కురిసింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకూ ముసురుపట్టి వర్షం కురుస్తూనే ఉండటంతో చలి వాతావరణమేర్పడింది. నల్గొండలో సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రత 25.7 డిగ్రీలైతే 20.4 డిగ్రీలే నమోదైంది.