భూవివాదాల పరిష్కార చర్యల్లో భాగంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయేతర భూముల సర్వే జరుపుతున్న సంగతి తెలిసిందే. దసరా నుంచి వ్యవసాయేతర ఆస్తులకు ప్రత్యేక పాసుపుస్తకాలు జారీచేయాలని భావిస్తున్న సర్కారు అక్టోబరు పదికల్లా ప్రక్రియ పూర్తిచేయాలని గడువు పెట్టింది. ఒక్కో కార్యదర్శి రోజుకు 60 ఆస్తులు సర్వే చేయాలని అధికారులు చెబుతున్నారు. జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్లకు సర్వే పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. ‘టి.ఎస్.నాప్’ పేరుతో ప్రత్యేకంగా యాప్‌నూ అభివృద్ధి చేశారు. కానీ, క్షేత్రస్థాయి సమస్యల కారణంగా సర్వే అనుకున్నంత వేగంగా జరగడంలేదు.
ఉదాహరణకు.. ప్రతి ఊళ్లో సగటున 20 శాతం ఇళ్లకు సంబంధించి పూర్తి వివరాలు దొరకడంలేదని, కొందరు యజమానులు వేరే ప్రాంతాల్లో ఉంటున్నారని, మరికొన్ని ఇళ్ల యజమానులు చనిపోయారని, ఇలాంటప్పుడు ఏంచేయాలన్న దానిపై మార్గదర్శకాలు లేవని ఓ కార్యదర్శి వెల్లడించారు. అన్నింటికీ మించి కొందరు గ్రామస్థులు వివరాలు చెప్పేందుకు, ఫొటో దిగేందుకు సైతం ఇష్టపడటంలేదని, వీరిని ఒప్పించడానికి తలప్రాణం తోకకు వస్తోందని, ఇలాంటప్పుడు ఆలస్యం అనివార్యమవుతోందని వారు వాపోతున్నారు. అలానే ఒక్కో ఆస్తికి సంబంధించిన సమాచారం నింపాలంటే యాప్‌లో కనీసం 30 వరకూ అంశాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఇవన్నీ క్రోడీకరించాక ఒక్కోసారి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అనేక సందర్భాల్లో వివరాలన్నీ యాప్‌లో నమోదు చేశాక అకస్మాత్తుగా ఫోన్ స్తంభించిపోతోంది.