రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు సగానికిపైగా చెరువుల్లో ముడొంతుల వరకూ నీళ్లు నిల్వ చేరాయి. సుమారు తొమ్మిదివేల చెరువులు అలుగు పారుతున్నాయి. అయినప్పటికీ జిల్లాల్లో చెరువుల మరమ్మతులు ఇంకా మొదలు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కట్టలు తెగడం, బుంగలు పడటం, అలుగు కోతకు గురికావడం, తూములు శిథిలమవడం వంటి సమస్యలతో రెండేళ్లలో అనేక చెరువులు మరమ్మతులకు గురయ్యాయి. 2020లోనే దాదాపు 915 తటాకాలకు నష్టం వాటిల్లింది. కొన్నింటికే మరమ్మతులు చేశారు. గతేడాది కూడా చాలా చెరువులకు నష్టం వాటిల్లింది. వీటిని బాగుచేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నా.. అవి కొలిక్కిరావడం లేదని రైతులు చెబుతున్నారు.
సీఈల పరిధిలోకి చెరువులు:రాష్ట్రంలో కృష్ణా పరీవాహకంలోని ఉమ్మడి మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 23,301 చెరువులున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో 20,111 ఉన్నాయి. చిన్న తరహా నీటిపారుదల విభాగం ఆధ్వర్యంలో మూడేళ్ల క్రితం వరకు మిషన్ కాకతీయ కింద 26 వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టారు. అనంతరం 2020లో నీటిపారుదల వ్యవస్థనంతటినీ పునర్‌వ్యవస్థీకరించి రాష్ట్రంలో 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పాటు చేశారు. వీటిలో చిన్న, మధ్య, భారీ నీటిపారుదల విభాగాలన్నీ ఆయా ముఖ్యఇంజినీర్ల (సీఈ) పరిధిలోకి చేరాయి. ఈ నేపథ్యంలో చెరువుల మరమ్మతుకు తగినన్ని నిధులు విడుదల కావడం లేదని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు.
ముందుకురాని గుత్తేదారులు: మిషన్ కాకతీయ పనులతోపాటు, వివిధ మరమ్మతులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటూ గుత్తేదారులు హైదరాబాద్‌లోని నీటిపారుదలశాఖ ప్రధాన కార్యాలయం చుట్టూ తిరిగిపోతున్నారు. ఈ కారణంగా జిల్లాల్లో కొత్తగా మరమ్మతుల పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని సమాచారం. అత్యవసర సమయాల్లో డీఈఈ నుంచి ఈఎన్‌సీ వరకు ఓ అండ్ ఎం కింద కేటాయించిన నిధులతో తాత్కాలికమైనవి, చిన్నచిన్న పనులు మాత్రమే పూర్తి చేస్తున్నారని ఇంజినీర్లు చెబుతున్నారు.
ఇవీ చూడండి