గత ఏడాది భారీ వర్షాలకు చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. ఈ దఫా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జులై నెలలోనే పొంగిపొర్లుతూ ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. గతంలో అర్ధరాత్రి వేళ భారీగా వరద నీరు చేరి విలయం సృష్టించిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడూ అదే భయంతో అనేక లోతట్టు ప్రాంతవాసుల్లో కంటిమీద కునుకు కరవైంది. రెండు వారాలుగా హైదరాబాద్ మహా నగరంలో సగటున 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరో నాలుగైదు సెంటీమీటర్లు పడితే 50 చెరువుల పరిధిలో కాలనీలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.
సమస్య ఏంటంటే: ఒక అద్భుత ప్రణాళికతో చెరువులను నిర్మించిన చరిత్ర నగరానికి ఉంది. గొలుసుకట్టు తరహాలో వీటి నిర్మాణం సాగింది. ఒకదానితో ఒకటి అనుసంధానం కావడం వల్ల ఒక చెరువు నిండగానే కింది చెరువుకు అదనపు నీరు వెళ్లేది. ఏళ్లుగా ఈ నాలాలు ఆక్రమణలకు గురై అదనపు నీరు కింది చెరువుల్లోకి వెళ్లే మార్గాలు మూతపడ్డాయి.
ప్రభుత్వం ఏం చెప్పిందంటే: వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఎన్‌డీపీ) కింద నాలాల రూపు మారుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిధుల సమస్యతో పనులు ముందుకు సాగడం లేదు. అక్కడక్కడ కట్టలు వెడల్పు చేసినా పనులు నాసిరకంగా సాగాయి.
ఇప్పటికే బురాన్‌ఖాన్ చెరువులో పూర్తిస్థాయి నీటి మట్టం నీరు చేరింది. సమీపంలోని ఉస్మాన్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాలు ప్రస్తుతం ముంపు నీటిలో ఉన్నాయి.
వనస్థలిపురం సమీపంలోని కప్రాయ్ చెరువు పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉంది. 20 కాలనీల్లో రహదారులపైకి నీరు చేరింది. వరద నీటి మళ్లింపు చేపట్టకపోతే హరిహరపురం ముంపు బారిన పడనుంది.
తూర్పు ఆనంద్‌బాగ్‌లోని బండచెరువు సుమారు 35 ఎకరాల్లో ఉంది. ఆర్కేపురం చెరువు నుంచి సఫిల్‌గూడ చెరువు.. అక్కడి నుంచి బండ చెరువులోకి వరద నీరు ప్రవహిస్తుంది. పూడికతో పాటు అస్తవ్యస్త నాలాల కారణంగా బండ చెరువు నుంచి వస్తున్న వరద నీరు ఐదు కాలనీలను ముంచెత్తుతోంది. గత వారం కిందటి వర్షాలకు షిర్డీనగర్, ఎన్‌ఎండీసీ కాలనీల్లో నాలుగు నుంచి ఐదు అడుగుల నీరు చేరింది. ఎప్పటికప్పుడు చెరువు నుంచి నీటిని విడుదల చేస్తున్నా కాలనీలకు ముంపు తప్పడం లేదు.