pollution of Ponds in Telangana : హుస్సేన్‌సాగర్ లాంటి మురుగునీటి కాసారం.. మూసీలో కాలుష్యం.. ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. రాష్ట్రంలో ఇతర నగరాలు, పట్టణాలు, జిల్లాకేంద్రాల సమీపంలో తయారయ్యాయి. వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్, కొత్తగూడెం, వనపర్తి, కామారెడ్డి.. ఇలా ఎక్కడ చూసినా మురుగునీటి నిల్వ కేంద్రాలుగా చెరువులు మారుతున్నాయి. జలవనరులన్నీ కలుషితమవుతున్న తీరు పట్ల పర్యావరణవేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ వ్యర్థాల శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
దుర్భరంగా చెరువులు, వాగులు
- Telangana Cheruvulu : 10 లక్షల జనాభా, 2.20 లక్షల నివాస గృహాలు, వ్యాపార సముదాయాలు ఉన్న వరంగల్ నుంచి రోజూ 120 మిలియన్ లీటర్ల(ఎంఎల్‌డీ) మురుగు విడుదలవుతోంది. ఇది నాగారం చెరువు, ములుగు కోటి చెరువు, దేశాయిపేట చిన్నవడ్డెపల్లి చెరువుల్లోకి చేరుతోంది. 100 ఎంఎల్‌డీ సామర్థ్యంతో శుద్ధి కేంద్రాల ఏర్పాటు (సివేట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్/ఎస్టీపీ) సాగుతోంది.
- సుమారు లక్ష గృహాలుండే ఖమ్మం నుంచి విడుదలయ్యే మురుగు మున్నేరులోకి చేరుతోంది. ఇక్కడ ఎస్టీపీల నిర్మాణం ప్రారంభమైంది.
- 80 వేల నివాసాలున్న నిజామాబాద్ నుంచి విడుదలయ్యే 7 ఎంఎల్‌డీ మురుగు పులాంగ్‌వాగు ద్వారా నందిపేట మండలం ఉమ్మెడ వద్ద గోదావరిలో కలుస్తోంది. భూగర్భ డ్రైనేజీ, శుద్ధి కేంద్రాలున్నా ప్రారంభం కాలేదు.
- 64 వేల ఇళ్లున్న సిరిసిల్ల నుంచి 5 ఎంఎల్‌డీ మురుగు విడుదలవుతుండగా పంపులు ఏర్పాటుచేసి మానేరు డ్యాం వెనుక జలాల్లోకి కొంత ఎత్తిపోస్తున్నారు. మరికొంత కొత్త చెరువులోకి చేరుతోంది. ఎస్టీపీల నిర్మాణం ఆదిలోనే ఉంది.
- 48 వేల నివాసాలున్న మహబూబ్‌నగర్ నుంచి నిత్యం విడుదలయ్యే వ్యర్థాలు పెద్దచెరువు, పాలకొండ చెరువు, నల్లకుంట, ఎర్రకుంట, ఇమామ్‌సాగర్‌ల్లోకి చేరుతున్నాయి.
- కామారెడ్డి నుంచి 10 ఎంఎల్‌డీ మురుగు కాల్వల ద్వారా కామారెడ్డి వాగు నుంచి మానేరు నదిలోకి వెళ్తోంది.
- నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నుంచి విడుదలయ్యే మురుగు పెర్కిట్ గ్రామ ఊరచెరువు, మల్లారెడ్డి చెరువుల్లోకి చేరుతోంది.
- బోధన్ నుంచి విడుదలయ్యే 7 ఎంఎల్‌డీ మురుగు చిక్కి చెరువు, పాండు చెరువుల్లోకి చేరుతుంది. అక్కడి నుంచి హరిత నది(పసుపువాగు)లోకి వెళ్తోంది. వర్షాకాలంలో మురుగు గోదావరిలో కలుస్తుంది.
- వనపర్తి నుంచి 9.5 ఎంఎల్‌డీ వ్యర్థ జలం రాజనగర్ అమ్మచెరువులోకి వెళ్తోంది. అక్కడి నుంచి జయపల్లి చెరువులోకి చేరుతోంది.
Water Pollution in Telangana : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పురపాలక సంఘం నుంచి విడుదలయ్యే మురుగుతో వరిదేల ఊరచెరువు, మల్లపురాజు కుంట చెరువు, చుక్కాయిపల్లి చెరువు, చౌటబెట్ల వాగు, కొల్లాపూర్ మూలవాగులు కలుషితమవుతున్నాయి.
- కొత్తగూడెంలో 6.3 ఎంఎల్‌డీ వ్యర్థ జలాలు విడుదలవుతుండగా గోదావరి ఉపనదులైన ముర్రేడు, గోధుమ వాగులోకి కలుస్తున్నాయి.
- లారీ, ఆటో, ద్విచక్రవాహనాల సర్వీస్ కేంద్రాల నుంచి గ్రీజు, ఆయిల్, యాసిడ్లు డ్రెయిన్ల ద్వారా చెరువుల్లోకి చేరుతున్నాయి. ఆర్‌ఓ(రివర్స్ ఆస్మోసిస్ సిస్టం) కేంద్రాల నుంచి రసాయనాలు వస్తున్నాయి. జంతు వధ కేంద్రాలు, మాంసం విక్రయ కేంద్రాల వ్యర్థాలు కలుస్తున్నాయి.
కలుషితమవుతున్న నదులు