తెలంగాణ

telangana

ETV Bharat / city

Rain Updates : దంచికొడుతున్న వర్షాలు.. పోటెత్తుతున్న వాగులు - heavy rain in telangana

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. విరామం లేకుండా కురుస్తున్న వానతో.. పట్టణాలు, గ్రామాలన్ని జలమయమవుతున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. గురు, శుక్రవారాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు(Rain Updates) కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

పోటెత్తుతున్న వాగులు
పోటెత్తుతున్న వాగులు

By

Published : Jul 22, 2021, 6:52 AM IST

రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Rain Updates) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ఉమ్మడి నల్గొండ, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మేఘాలు కమ్ముకున్న ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని తెలిపింది.

బుధవారం రాష్ట్రంలో వర్షాలు(Rain) జోరుగా కురిశాయి. పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. గరిష్ఠంగా నిర్మల్‌ జిల్లా మామడ మండలంలో 8 సెం.మీ. వర్షం కురిసింది. ఇదే జిల్లా కడెం పెద్దూరులో 6.8, సారంగపూర్‌ మండలంలో 6.7 సెం.మీ. వర్షం నమోదైంది. ఈ జిల్లావ్యాప్తంగా పది మండలాల్లో 5 సెం.మీ. పైగా వర్షపాతం కురిసింది. నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలతోపాటు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16 ప్రాంతాల్లో 1 నుంచి 1.5 సెం.మీ. వర్షపాతం కురిసింది. వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల జలపాతానికి వచ్చిన పర్యాటకులు తిరుగు ప్రయాణంలో వాగు పొంగడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెన్‌గంగ ఉద్ధృతంగా ప్రవహించింది. కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం చింతలమాదరం జలపాతంలో పడి బుధవారం మహారాష్ట్రకు చెందిన 23 ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. నిర్మల్‌ జిల్లాలోని గడ్డెన్న ప్రాజెక్టులో 4, స్వర్ణ ప్రాజెక్టుల్లో ఒక గేటు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద సీతవాగు పొంగడంతో సీతమ్మ నారచీరల ప్రాంతం నీటమునిగింది. చినగుబ్బలమంగి వాగు ప్రాజెక్టులో వరద అలుగు దూకడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

ప్రాజెక్టులకు పెరిగిన ప్రవాహం

కృష్ణా నదిలో ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలానికి 1.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ ప్రాజెక్టుకు మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 8.32 టీఎంసీల మేర, బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 4.15 టీఎంసీల మేర జలాలు వచ్చి చేరాయి. తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రం నుంచి ఉత్పత్తి అనంతరం 28,252 క్యూసెక్కుల నీటిని సాగర్‌ వైపు వదులుతున్నారు.

గోదావరి పరీవాహకంలోని శ్రీరాంసాగర్‌కు వరద స్వల్పంగా పెరిగి 17 వేల క్యూసెక్కులు వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గానూ 1087 అడుగులకు నీరు చేరింది. 90.31 టీఎంసీల సామర్థ్యానికి గానూ.. 73.55 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తోంది. ఎల్లంపల్లి నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ నుంచి లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టుల పరిస్థితి

ABOUT THE AUTHOR

...view details