ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకే పలువురు ఓటర్లు.. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 126 ఏకగ్రీవమయ్యాయి. 8 స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోగా.. పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించిన 11 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 2 వేల 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో 10 వేల 47 ఎంపీటీసీ స్థానాలుండగా.. 2వేల 371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 375 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు.
81 చోట్ల వాయిదా..
అభ్యర్థులు మరణించిన 81 చోట్ల ఎన్నికలను వాయిదా వేశారు. మిగిలిన 7వేల 220 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. 18 వేల 782 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 7 వేల 735 పరిషత్ స్థానాలకు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే ఎన్నిక ముగియనుంది. 2 కోట్ల 46 లక్షల 71 వేల 2 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 27 వేల 751 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటిలో 6 వేల 492 సున్నిత పోలింగ్ స్టేషన్లు కాగా....అతి సున్నితమైనవి 6వేల 314 కేంద్రాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. 247 స్టేషన్లను నక్సల్ ప్రభావిత పోలింగ్ స్టేషన్లుగా గుర్తించామన్న అధికారులు....వీటిల్లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.