తెలంగాణ

telangana

ETV Bharat / city

మున్సిపల్​ ఎన్నికలకు పార్టీల కసరత్తు - congress on telangana municipal elections

గులాబీ బంతిని ఎదుర్కొనేందుకు ఆటగాళ్లు కసరత్తు చేసినట్లుగా మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీని ఎదుర్కొనేందుకు విపక్షపార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. జోరు సాగించాలని తెరాస... సత్తా చాటాలని కాంగ్రెస్​... ఉనికి చాటుకోవాలని భాజపా... తామేమి తక్కువ కాదంటూ తెదేపా, తెజస, వామపక్షాలు... పురపోరుకు సన్నద్ధమవుతున్నాయి. గులాబీ పార్టీని కట్టడిచేయడానికి విపక్షాలు కసరత్తు చేస్తున్నాయి.

telangana municipal elections
telangana municipal elections

By

Published : Dec 28, 2019, 9:44 AM IST

మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీలన్ని వ్యూహన్ని ఖరారు చేసే పనిలో పడ్డాయి. పార్టీలన్ని ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. పట్టు నిలుపుకోవాలని అధికార తెరాస.. పట్టు సాధించాలని కాంగ్రెస్​... ఉనికిని చాటుకుని గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా నిలవాలని భాజపా.. సన్నద్ధమవుతున్నాయి. క్రికెట్​లో ఆటగాళ్లు గులాబీ బంతి కోసం ప్రత్యేకంగా కసరత్తు చేసినట్లు.. గులాబీ పార్టీని కట్టడిచేయడానికి విపక్షాలు కసరత్తు చేస్తున్నాయి.

గేర్​ మార్చి స్పీడ్​ పెంచిన కారు

మున్సిపల్​ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కారు... ఇప్పటికే గేర్​ మార్చి హై స్పీడ్​లో వెళ్తోంది. పార్టీ రాష్ట్ర కమిటీతో కేటీఆర్​ సమావేశమై పుర ఎన్నికల్లో దిశ నిర్దేశం చేశారు. ప్రాథమికంగా అభ్యర్థులను ఎంపిక చేసిన గులాబీ పార్టీ... ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించింది. ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం కేసీఆర్​ ఫోన్​లో మాట్లాడి... మున్సిపల్​ ఎన్నికలపై ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో ఉండాలని ఆదేశించారు. ప్రచారం ప్రారంభించాలని సూచించారు. ఈ వారంలోనే తెరాస శాసనసభాపక్ష సమావేశం నిర్వహించే వీలుంది.

డీసీసీకి బాధ్యతలు

రాష్ట్రంలో పట్టు సాధించాలని భావిస్తోన్న కాంగ్రెస్​... పుర పాలక ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. పురపాలక ఎన్నికల కోసం పీసీసీ గతంలో ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ పలుమార్లు సమావేశమై అభ్యర్థుల ఎంపిక విధివిధానాలపై చర్చించింది. అభ్యర్థుల బాధ్యతను డీసీసీలకు అప్పగించింది పీసీసీ నాయకత్వం. స్థానికంగా ప్రజాదరణ కలిగి.. పార్టీకి విధేయులై ఉండడం, ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కొనగలిగే సత్తా ఉన్న వారి జాబితాను సిద్ధం చేయాలని డీసీసీలకు పీసీసీ నాయకత్వం సూచించింది. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి... గెలుపొందాలని భావిస్తోంది. వార్డుల విభజన, రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే ఎన్నికల షెడ్యూలు ఇవ్వడంపై పోరాటం చేస్తూనే... ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది.

ఆ ఉత్సాహంతోనే భాజపా

లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 4 స్థానాలు సాధించిన ఉత్సాహం మీదున్న భాజపా... మున్సిపల్​ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తోంది. తెరాసకు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న కమళ దళం... పురపాలికల్లో కాషాయ జెండా ఎగురవేసే లక్ష్యంతో పని చేస్తోంది. ఎన్నికలకు భాజపా సిద్ధంగా ఉందని... అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులను సమాయత్తం చేశామని రాష్ట్ర నాయకత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేసిందని గత ఐదేళ్లలో చూపిన వివక్షతను, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేసింది.

ముందుగానే ఏర్పాట్లు

ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నా... రిజర్వేషన్లపై స్పష్టత లేకపోవడంతో గందరగోళం ఏర్పడింది. ఏ స్థానం ఎవరికి రిజర్వ్‌ అవుతుందో తెలియక... అభ్యర్థుల ఎంపికపై స్పష్టత ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆశావహులు మాత్రం ముందుగానే అవసరమైన ధ్రువపత్రాలు సిద్ధం చేసి పెట్టుకునే పనిలో పడ్డారు.

ఇదీ చూడండి: 'మున్సిపోల్స్' ప్రతిపైసా లెక్కచెప్పాల్సిందే..!

ABOUT THE AUTHOR

...view details