మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో వందల ఎకరాల భూముల పరాధీనం వెనుక స్థానిక నేతల పాత్ర తాజాగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్‌పేట తదితర ప్రాంతాల్లోనూ ఇదే విధమైన తంతు చోటుచేసుకుంది. జవహర్‌నగర్‌లో ఏకంగా వెయ్యి ఎకరాల ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ అనేక కాలనీలుగా రూపుదిద్దుకున్నాయి. చాలామంది అనధికారికంగా కొనుగోలు చేసి ఇళ్లను నిర్మించుకున్నారు. స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకులు వందల ఎకరాలను కబ్జా చేసి ఈ తంతు సాగించారు. నోటరీ పేరుతో క్రయవిక్రయాలు జరిగిపోయాయి. ఇంత జరుగుతున్నా వెలుగులోకి రాకపోవడానికి కారణం అన్ని పార్టీల నేతలు ఒక అవగాహనతో ఆక్రమణలను ప్రోత్సహించడమేనని తెలుస్తోంది.
గత ఏడాది కాలంలో 150 ఎకరాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడానికి స్థానిక నేతలు ప్రయత్నాలు ఆరంభించారు. దీనిపై పూర్తి సమాచారం అందడంతో కాప్రా తహసిల్దార్ గౌతమ్‌కుమార్ చర్యలకు ఉపక్రమించారు. ఆక్రమణదారుల నుంచి ఇప్పటివరకు 150 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. కబ్జాలను తొలగించడానికి వెళితే సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు నిప్పంటించడం సంచలనం కలిగించింది. కొంతమంది నాయకులు రెచ్చగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నగరం మధ్యలోనూ..
బంజారాహిల్స్ రోడ్డు నం.51లో రూ.100 కోట్ల విలువైన ఎకరన్నర ప్రభుత్వ భూమి ఉంది. స్థానిక నేతలు రంగప్రవేశం చేసి ముందుగా ఆ ప్రాంతంలో నిర్మాణాలు మొదలుపెట్టారు. అనధికారికంగా అమ్మకాలు మొదలుపెట్టారు. రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ ఈ కబ్జాలను చూసి రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. షేక్‌పేట తహసిల్దార్ శ్రీనివాసరెడ్డి వెళ్లి స్వాధీనం చేసుకుని బోర్డు పెట్టించారు.
గోల్కొండ సమాధుల దగ్గర సర్కార్‌కు రూ.75 కోట్ల విలువైన ఎకరన్నర భూమి ఉంది. పదిరోజుల క్రితం నేతలు ఆక్రమించగా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.