ఎమ్మెల్సీ పోరు... విమర్శలు, ప్రతివిమర్శలతో నాయకుల హోరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో 10రోజుల గడువు మాత్రమే ఉండటంతో... అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా మండలి ఎన్నికలు సైతం సవాల్‌గా మారటంతో... నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఖాళీల భర్తీ అంశంపై నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి.
తమ పరిపాలనపై ఉద్యోగులు, యువతలో ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే సరైన వేదికగా భావిస్తున్న అధికార తెరాస.... రెండు స్థానాలు తామే కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు అధిష్ఠానం తమకు అప్పగించిన జిల్లాల్లో మంత్రులు, పార్టీ నేతలు విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. హైదరాబాద్ - మహబూబ్ నగర్ - రంగారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి సురభి వాణీదేవికి గెలిపించాలంటూ... మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. తాండూరులో పట్టభద్రులతో జరిగిన సదస్సుకు అభ్యర్థితో కలిసి హాజరైన మంత్రులు... శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన రాంచందర్‌రావు... ఆ పదవి ఉండగానే మరో మూడింటికి పోటీచేశారని విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్.... సనత్‌నగర్‌లో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్థి సురభి వాణిదేవిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కంకణబద్ధులు కావాలని ఆయన కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షా 32 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని... మరో 50వేల పోస్టులకు రంగం సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. జనగామలో పర్యటించిన ఆయన.. భాజపా ఎన్నికలహామీలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కృష్ణకాంత్ పార్కులో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం, రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో భాజాపా లీగల్‌సెల్ నిర్వహించిన న్యాయవాదుల సంతకాల సేకరణకు హాజరైన ఆయన... తెరాస నేతలు తనపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. నారాయణ పేట జిల్లా మక్తల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో స్వతంత్ర, భాజపా అభ్యర్ధులు ఎమ్మెల్సీలుగా పనిచేసినా... పట్టభద్రుల సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారన్నారు. వరంగల్ రంగశాయిపేట మైదానంలో తెజస ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం ఓట్లు అభ్యర్థించారు. ఉద్యమ ఆకాంక్షను తెరాస ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న ఆయన... మార్పు కోసం పట్టభద్రుల ఎన్నికలను ఆయుధంగా వాడుకోవాలని కోరారు. ఖమ్మంలోని సర్దార్‌పటేల్ స్టేడియంలో యువతెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమ ప్రచారం నిర్వహించారు. ప్రశ్నించే గొంతుకకు అవకాశమివ్వాలంటూ ఆమె ఓట్లు అభ్యర్థించారు.