Ayyannapatrudu: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యన్న ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. నీటిపారుదల శాఖకు చెందిన స్థలం ఆక్రమించారనే ఆరోపణలతో అయ్యన్న ఇంటి గోడను ఆదివారం వేకువజామున మున్సిపల్ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా గోడ కూల్చేశారంటూ అయ్యన్న కుటుంబసభ్యులు, తెదేపా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో అయ్యన్నపాత్రుడి రెండో కుమారుడు చింతకాయల రాజేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో భారీగా తెదేపా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. గోడ కూల్చివేతకు వచ్చిన జేసీబీ టైర్లలో గాలిని అయ్యన్న అనుచరులు తీసేశారు. ఇప్పటికే వంద మందికి పైగా పోలీసులు అక్కడ ఉండగా.. మరో 3 బెటాలియన్లను అదనంగా తీసుకొచ్చి మోహరించారు. అంతే సంఖ్యలో అభిమానులు, తెదేపా కార్యకర్తలు అక్కడికి వచ్చి అయ్యన్న కుటుంబానికి మద్దతుగా నిలిచారు. అక్కడే టెంట్ వేసి మున్సిపల్ సిబ్బంది, పోలీసుల వైఖరి పట్ల నిరసన తెలుపుతున్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అయ్యన్న ఇంటి వద్దకు వచ్చి కూల్చివేసిన గోడను పరిశీలించారు. మరోవైపు అయ్యన్న ఇంటికి వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆయన నివాసానికి వెళ్లే 2 మార్గాలను పోలీసులు మూసివేశారు.
.