చెరువును ఆక్రమించి రిసార్టు కట్టారు.. ప్రశ్నించిన తహశీల్దార్ని అడ్డుకున్నారు! ప్రజా సంపదకు, ప్రభుత్వ భూములకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ప్రైవేటు వ్యక్తులకు వత్తాసు పలికిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామ పరిధిలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఓ రిసార్ట్ నిర్మిస్తున్నారు. అయితే.. ఆ రిసార్ట్ మధ్యలో మునిదేవునిపల్లి గ్రామ పంటపొలాలకు నీరందించే చెరువు, కాలువ ఉన్నాయి. వాటిని ధ్వంసం చేసి దర్జాగా రిసార్టు నిర్మిస్తున్నారు ఆక్రమణదారులు. ఈ విషయమై గ్రామస్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
బౌన్సర్లతో అడ్డుకున్నారు..
కలెక్టర్ ఆదేశాల మేరకు ఆక్రమణకు గురైన చెరువు దగ్గరకు వెళ్లిన తహశీల్దార్ బృందాన్ని ఆక్రమణదారుల ప్రైవేటు కాపలాదారులు, బౌన్సర్లు అడ్డుకున్నారు. అధికార బృందాన్ని లోపలికి రాకుండా వెనక్కి పంపించివేశారు. అయినా.. తహశీల్దార్ అక్కడే చెట్టుకింద కూర్చుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఐదు గంటల పాటు నిరీక్షించినా ఆక్రమణదారులు, ప్రైవేటు బాడీగార్డులు అధికారులను లోపలికి వెళ్లనివ్వలేదు.
పోలీసులు సైతం వారికే మద్దతు
ఆక్రమణలు స్వాధీనం చేసుకునేందుకు మూడు జేసీబీలు, 20 మంది సిబ్బంది, నీటి పారుదల శాఖ అధికారులు, తహశీల్దార్ బృందం అక్కడికి చేరుకున్నారు. ప్రైవేటు సెక్యూరిటీలు అడ్డుకోవడం వల్ల అధికారులు పోలీసుల సహాయం తీసుకున్నారు. స్థానిక ఎస్సై రాజు సైతం.. తహశీల్దారు బృందాన్ని అడ్డుకుని సీఐ వచ్చేవరకు లోపలికి వెళ్లేది లేదంటూ ఆపారు. చేసేదేమీ లేక అధికారులు అక్కడే పడిగాపులు కాశారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో నగేష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రైవేటు భూమిలోకి వెళ్లడానికి అనుమతి లేదంటూ సీఐ సైతం అడ్డుకోగా.. ఆ పక్కనే ఉన్న కట్టు కాలువలోంచి రెవిన్యూ సిబ్బంది లోపలికి వెళ్లారు.
రైతులను వెళ్లగొట్టారు..
అధికారులకు తమ సమస్యలు చెప్పుకోడానికి వచ్చిన రైతులను సైతం పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. మీడియాను కూడా లోపలికి వెళ్లనివ్వలేదు. కట్టు కాలువ మార్గం గుండాలోనికి వెళ్లిన రెవెన్యూ, నీటి పారుదల అధికారులు.. అక్రమణలను గుర్తించారు. రిసార్ట్ నిర్వాహకులు నీటిపారుదల శాఖకు చెందిన కాలువ, చెరువను ధ్వంసం చేశారని అధికారులు ధృవీకరించి వారిపై నీటి పారుదల చట్టం, వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్