కొన్ని విధ్వంసక శక్తులు జీహెచ్ఎంసీ ఎన్నికల ఆసరాగా రెచ్చిపోయే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. బల్దియా ఎన్నికలు శాంతిపూర్వక వాతావరణంలో జరిగేలా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో కలిపి 51 వేల500 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ, స్వీకరణ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మొహరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను కల్పిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సాధారణ, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి...అవసరమైన చోట అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... వీటిని అరికట్టేందుకు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
జీహెచ్ఎంసీ సరిహద్దులతో పాటు నగరంలోని పలుచోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,704 సమస్యాత్మక, 1,085 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. దాదాపు 3,500 మంది రౌడీషీటర్లు, అనుమానితులను బైండోవర్ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లకు సీపీ అంజనీ కుమార్ పోలీస్ ఉన్నతాధికారులను బాధ్యులుగా నియమించారు.