అల్ప పీడనం వల్ల వారం రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల(AP floods rescue 2021) కారణంగా.. చెరువులు, వాగులు, వంకల్లో ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం లింగాలలో ప్రవహిస్తున్న వాగులో ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు వాగులో పడిపోయాడు. ద్విచక్రవాహనంపై వెళుతుండగా.. గ్రామంలోని హైస్కూల్ వద్ద ఉన్న బ్రిడ్జిపై నుంచి ప్రమాదవశాత్తు కింద ఉన్న వాగులోకి జారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వెంటనే ఈ సమాచారాన్ని గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మార్వో శేషారెడ్డి, ఎంపీడీవో సురేంద్ర నాథ్, ఎస్సై రుషీకేశవ రెడ్డి, పోలీసులు స్థానికుల సహకారంతో ఆ వ్యక్తిని కాపాడారు. తన ప్రాణాలు కాపాడిన అధికారులకు బాధితుడు ప్రతాపరెడ్డి కృతజ్ఞతలు తెలిపాడు.
AP floods rescue 2021: వరదలో కొట్టుకుపోయిన వాహనదారుడు.. అధికారుల రెస్క్యూ
కడప జిల్లాలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ ఓ వ్యక్తి వరద ప్రవాహానికి(TWO WHEELER WASHED AWAY IN FLOODS RESCUED) కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు సకాలంలో స్పందించి అతడిని కాపాడారు.
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో రాయలచెరువుకు స్వల్ప గండిపడి వరదనీరు లీకవుతోంది. ఈ ప్రాంతంలో కట్ట నుంచి మట్టి క్రమంగా జారిపోతోంది. భారీ వర్షాలకు తిరుపతి సమీపంలోని రాయలచెరువు నిండుకుండలా మారింది. సామర్థ్యం కంటే ఎక్కువ నీరు వస్తుండటంతో కట్ట తెగే ప్రమాదం(Rayalacheruvu tirupati news) ఉందని ఆయకట్టు ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న రాయలచెరువుకు 30 మీటర్ల వెడల్పుతో 2.5 కి.మీ కట్ట ఉంది. రాయలచెరువు నీటి సామర్థ్యం 0.5 టి.ఎం.సీలు కాగా..ప్రస్తుతం 0.9 టి.ఎం.సీల నీరు చేరడంతో ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి. చెరువు కట్టకు చిన్న గండి పడడంతో చెరువులోంచి వరదనీరు లీకు అవుతోంది. అప్రమత్తమైన అధికారులు దక్షిణం వైపు ఉన్న కట్టను తొలగించి జేసీబీల సాయంతో నీటిని మళ్లించారు. స్థానికులు, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి పెద్ద సంఖ్యలో ఇసుక బస్తాలను సమకూర్చుకుని నీరు లీకవుతున్న ప్రాంతంలో నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్
అతిపెద్ద చెరువుకు ప్రమాదం పొంచి ఉందంటూ ఉన్నతాధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. చెరువు కింది భాగంలో వంద గ్రామాలకు ముంపు పొంచి ఉంది. 19గ్రామాల్లోని 15వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. సంతబయలు, ప్రసన్న వెంకటేశ్వరపురం, నెన్నూరు, గంగిరెడ్డిగారిపల్లె, సంజీవరాయపురం, కమ్మపల్లె, గొల్లపల్లె, కమ్మకండ్రిగ, నడలలూరు, వెంకట్రామాపురం, రామచంద్రాపురం, మిట్టూరు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఖాళీ చేయిస్తున్నారు. చెరువు గండి పూడ్చివేతకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. తిరుపతిలో వరద పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. గొల్లవానిగుంట, సరస్వతీనగర్, శ్రీకృష్ణనగర్ వరదలోనే ఉన్నాయి. శ్రీనివాసమంగాపురం రైల్వేవంతెన వద్ద రహదారి దెబ్బతినడంతో ట్రాఫిక్ స్తంభించింది. బంగారుపాళ్యం మండలం టేకుమందలో గల్లంతైన(floods in chittoor district) ముగ్గురు మహిళల కోసం డ్రోన్లతో గాలిస్తున్నారు. జిల్లాలో వందల గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మదనపల్లె మండలం చీకలబైలు పంచాయతీ రావిమాకులపల్లె వద్ద బహుదా కాలువపై కల్వర్టు కొట్టుకుపోయి 5గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. పాకాల మండలంలో రెండు చోట్ల రోడ్డు దెబ్బతినడంతో తిరుపతి-పుంగనూరు మధ్య రాకపోకలు నిలిచాయి.