తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలీసుల జులుం... వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే

RTC employees children : కారుణ్య నియమకాల కోసం వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన వారిని పోలీసులు నిర్బంధించారు. తామేమీ ధర్నాలు, ఆందోళనలు చేయడానికి రాలేదని.. కేవలం వినతిపత్రం ఇచ్చేందుకే వచ్చామని చెబుతున్నా వినకుండా పోలీస్​స్టేషన్‌కు తరలించారు. రోజంతా భోజనం పెట్టకుండా, నేలపైన కూర్చోబెట్టారు. మరోసారి ఇలా వస్తే క్రిమినల్‌ కేసులు పెడతామని, ఉద్యోగాలు సైతం రావని హెచ్చరించి వదిలేశారు.

RTC employees children
RTC employees children

By

Published : Apr 21, 2022, 9:30 AM IST

RTC employees children : వారంతా సర్వీసులో ఉంటూ చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలు. కారుణ్య నియామకాల కోసం సంస్థ ఎండీకి వినతిపత్రం ఇచ్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి బుధవారం ఉదయం ఏపీలోని విజయవాడకు చేరుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. అసాంఘిక శక్తులనో, దొంగలనో పట్టుకున్నట్లుగా వారితో వ్యవహరించారు. తామేమీ ధర్నాలు, ఆందోళనలు చేయడానికి రాలేదని.. కేవలం వినతిపత్రం ఇచ్చేందుకే వచ్చామని చెబుతున్నా వినకుండా పోలీసుస్టేషన్‌కు తరలించారు. దాదాపు 5 గంటల పాటు నేలపైనే కూర్చోబెట్టారు. రోజంతా పస్తు ఉంచారు. మరోసారి ఇలా వస్తే క్రిమినల్‌ కేసులు పెడతామని, ఉద్యోగాలు కూడా రావని హెచ్చరించి వదిలేశారు.

ఆర్టీసీలో పనిచేస్తూ 2016 నుంచి వివిధ కారణాలతో మరణించిన 1,847 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ జాబితాల్ని జిల్లా కలెక్టర్లకు పంపించామని పేర్కొంది. అయితే కలెక్టరేట్లలో సంప్రదిస్తే తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటున్నారని, తమ ఉద్యోగాల పరిస్థితి ఏమిటో తెలియట్లేదని పేర్కొంటూ ఈ సమస్యపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి 27 మంది బుధవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. బస్టాండులో అంతా కలుసుకుని ఎదురుగా ఉన్న పద్మావతి ఘాట్‌కి వెళ్లారు. అక్కడ వినతిపత్రం సిద్ధం చేసుకుంటుండగా.. ఉదయం 9.30 గంటల సమయంలో పోలీసులు అక్కడున్న 14 మందిని అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీసుస్టేషన్‌కు తరలించారు. సాయంత్రం 3.15 గంటల వరకూ నిర్బంధించారు. సెల్‌ఫోన్లు తీసుకున్నారు. అందరి వివరాలు నమోదు చేసుకుని విడిచిపెట్టారు. తామంతా ఉదయం నుంచి టిఫిన్‌ చేయలేదని, ఆకలితో ఉన్నామని చెప్పినా పట్టించుకోలేదని బాధితులు కొందరు వాపోయారు.

ఏం తప్పు చేశామని?:ఆర్టీసీ ఉద్యోగైన మా నాన్న 2020లో మరణించారు. కారుణ్య నియామకాల కోసం కడప కలెక్టరేట్‌లో సంప్రదించగా.. తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ఎండీకి వినతిపత్రం ఇవ్వాలని వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేము ఏం తప్పు చేశామని నిర్బంధించారో చెప్పాలి. - శివ ప్రకాష్‌, కడప

ఎప్పటికి ఇస్తారో తెలియట్లేదు.. : "మా నాన్న కండక్టరుగా పనిచేస్తూ మరణించారు. కారుణ్య నియామకాలకు సంబంధించిన ఆదేశాలు ఇప్పటికీ రాకపోవటంతో ఎండీని కలిసి విన్నవించాలనుకున్నాం. అదేదో తప్పు అన్నట్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మా ఉద్యోగం ఎప్పటికి వస్తుందో అర్థం కావట్లేదు."

- జ్ఞానేష్‌, చిత్తూరు

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details