Police Behavior in Rape cases: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని కొన్ని పోలీస్‌స్టేషన్లలో ఇన్‌స్పెక్టర్లు, సెక్టార్ ఎస్సైలు లైంగికదాడి ఫిర్యాదులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాధితుల బలహీనతను అవకాశం చేసుకొని నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటీవల చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలి తరపు న్యాయవాది, తండ్రిని కొట్టిన ఎస్సైపై సీపీ స్టీఫెన్ రవీంద్ర శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. బాలానగర్ జోన్‌లోని మరో పోలీస్‌స్టేషన్‌లో మైనర్ అత్యాచార ఘటనలో నిందితులను చూసీచూడనట్లు వదిలేశారని బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
'అత్యాచారమా.. బయటే తేల్చుకోండి'.. బాధితులతో పోలీసుల నిర్లక్ష్య వైఖరి - hyderabad rape cases
Police Behavior in Rape cases: రోజూ ఏదో ఒక చోట యువతులు/చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహానగరంలో మొన్న జూబ్లీహిల్స్ .. నిన్న జవహర్‌నగర్.. తాజాగా చాంద్రాయణగుట్టలో మైనర్లపై జరిగిన వరుస సామూహిక అత్యాచారాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పోలీసు నిఘా, గస్తీ లోపాలకు నిదర్శనంగా నిలిచాయి. ఇదిలా ఉంటే.. బాధితుల పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సందర్భాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
కేసులా.. కాసులా..:గ్రేటర్‌లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 2020లో 904 అత్యాచార కేసులు నమోదైతే 2021 నాటికి అది 1061కు చేరింది. ఈ ఏడాది 20-30 శాతం కేసులు పెరుగుతాయని పోలీసులే అంచనా వేస్తున్నారు. ఇవన్నీ బాధితులు ధైర్యంగా ముందుకు రావటం వల్ల నమోదైన కేసులు. పేద, మధ్యతరగతి కుటుంబాల నిస్సహాయతను ఆసరా చేసుకొని దర్జాగా రాజీ చేసుకొనే కేసులు రెట్టింపు ఉంటాయని అంచనా. కొన్ని ఠాణాల పోలీసులు అత్యాచార, పొక్సో కేసులను నమోదు చేసేందుకు వెనుకంజ వేస్తున్నాయి. లైంగిక దాడులను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. మానవహక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు బాధితుల పక్షాన నిలుస్తున్నారు. నిందితుల్లో ప్రముఖుల కుటుంబాల ప్రమేయం ఉన్నట్లు తెలియగానే కొందరు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు బయటే తేల్చుకోమంటూ ఉచిత సలహాలిస్తున్నారు. సామాజిక, రాజకీయంగా అండదండల్లేని బాధితులతో ఠాణాల్లోనే పంచాయితీ చేస్తున్నారు. పెద్దమొత్తంలో కమీషన్లు పుచ్చుకుంటున్నారు.
అండలేక అజ్ఞాతంలోకి..:కేసులు, స్టేషన్లు, ఆసుపత్రులు, పరామర్శలు, బెదిరింపులు వీటిని తట్టుకోలేక అధికశాతం బాధిత కుటుంబాలు వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. న్యాయస్థానాల్లో వాయిదాలు, ఛార్జిషీట్లు, నష్టపరిహారం చెల్లింపు సమయంలో పోలీసు, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు బాధితుల చిరునామాకు వెళ్లినపుడు ఇవన్నీ వెలుగు చూస్తున్నాయి. అత్యాచారానికి గురైన అధికశాతం బాధితులు జీవితాంతం మనోవేదన అనుభవిస్తూనే ఉంటారని మనస్తత్వ విశ్లేషకులు డాక్టర్ రాంచందర్ మోతుకూరి తెలిపారు. వ్యక్తిగత, వివాహ జీవితంపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. మానసిక నిపుణుల అధ్యయనం ప్రకారం అత్యాచార బాధితులను చేదు అనుభవాలు 65 ఏళ్లపాటు వెంటాడతాయని భరోసా సమన్వయకర్త డాక్టర్ మమతా రఘువీర్ తెలిపారు.
- ఇవీ చదవండి :మొదట లైంగిక దాడి చేసింది కార్పొరేటర్ కుమారుడే.. సీన్ రీ కన్స్ట్రక్షన్లో నిర్ధారణకు వచ్చిన పోలీసులు
- Audio Viral: 'ఏసీపీ, సీఐలకు డబ్బులు అడ్జస్ట్ చేయాలి'
- భార్యకు ముద్దుపెట్టాడని భర్తను కొట్టారు.. కారణమేంటి?