తెలంగాణ

telangana

ETV Bharat / city

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషనే ఎందుకు లక్ష్యం?... సుబ్బారావుకు పోలీసుల ప్రశ్నల వర్షం

అగ్నిపథ్​ను వ్యతిరేకిస్తూ.. సికింద్రాబాద్​లో చేసిన ఆందోళనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో డిఫెన్స్‌ అకాడమీ నిర్వహిస్తున్న సుబ్బారావు పాత్ర ఉందని భావించిన పోలీసులు.. అతడిని అరెస్ట్​ చేసి పలు కోణాల్లో లోతుగా విచారిస్తున్నారు.

police interagating avula subbarao on secundrabad protest incident
police interagating avula subbarao on secundrabad protest incident

By

Published : Jun 19, 2022, 3:37 AM IST

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ నిన్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో వందలాది మంది యువకులు విధ్వంసానికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సికింద్రాబాద్‌ ఘటన వెనక నరసరావుపేటలో డిఫెన్స్‌ అకాడమీ నిర్వహిస్తున్న సుబ్బారావు పాత్ర ఉండొచ్చని పోలీసులు అనుమానించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసంలో పాల్గొని పోలీసులకు చిక్కిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారంతో శనివారం ఉదయమే సుబ్బారావును ప్రకాశం జిల్లా కంభంలో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నరసరావుపేటకు తీసుకొచ్చారని సమాచారం. దర్యాప్తు నిమిత్తం పేట పోలీసులకు అప్పగించారు.

వ్యూహరచన ఎలా జరిగింది?

రైల్వేస్టేషన్లను ఎందుకు లక్ష్యంగా చేసుకోవాల్సి వచ్చింది? ఎన్ని రోజుల నుంచి దీనికి వ్యూహ రచన జరిగింది? దీని వెనక ఇంకెవరు ఉన్నారు? విధ్వంసంలో పాల్గొన్న వారంతా సైనిక నియామకాల కోసం ప్రయత్నిస్తున్నవారేనా? బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అంతమంది స్టేషన్‌కు చేరుకోవటానికి ఎలా సమాచారం షేర్‌ చేసుకున్నారు? ఆ ఫోన్లు ఎవరివి? అని సుబ్బారావుకు ప్రశ్నలు సంధించి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తునట్టు సమాచారం.

ఆర్థిక సంక్షోభానికి తోడు అసహనం పెరిగి....

ప్రకాశం జిల్లా కంభం మండలం తురుమెళ్లకు చెందిన ఆవుల సుబ్బారావు ఆర్మీలో నర్సింగ్‌ అసిస్టెంట్‌గా చేరి అధికారి హోదాలో దేశంలోని పలు ప్రాంతాల్లో పనిచేసి 2012లో పదవీ విరమణ పొందారు. కొంతకాలం గుంటూరులో ఉండి 2014లో నరసరావుపేటలో సాయి డిఫెన్స్‌ అకాడమీని ప్రారంభించారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాలకు చెందిన యువకులు ఎక్కువగా ఇక్కడ శిక్షణ తీసుకుంటారని తెలుస్తోంది. గడిచిన రెండేళ్ల నుంచి కొవిడ్‌ కారణంగా శిక్షణకు రాకపోవడంతో అకాడమీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక సమస్యలు అధిగమించడానికి ఈఏడాది హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో అకాడమీని ఏర్పాటుచేశారు. ఆర్మీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కావటం, ఎంపికల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకోవటం, నియామకాలు వాయిదా పడటంతో హైదరాబాద్‌ కేంద్రాన్ని మూసేశారు. ఆర్మీ నియామకాల విషయంలో చోటుచేసుకున్న పరిణామాలతో విసిగిపోయిన సుబ్బారావు నిరుద్యోగ యువతతో కలిసి విధ్వంసానికి తెరా తీశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆవుల సుబ్బారావును అదుపులోకి తీసుకున్న విషయాన్ని, విచారణ అంశాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details