తెలంగాణ

telangana

ETV Bharat / city

సికింద్రాబాద్​ అల్లర్ల కేసులో కీలక ఆధారాలు.. అంతా సుబ్బారావు ప్లానేనటా..! - Secunderabad protests case updates

Secunderabad riots case update: సికింద్రాబాద్​ అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సుబ్బారావు పాత్రపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. రెండు రోజుల పాటు విచారించిన పోలీసులు.. అన్ని సాక్ష్యాలతో నేడు అరెస్టు చేసే అవకాశముంది. అయితే.. విచారణలో వెలువడిన కీలక విషయాలేమిటంటే.?

Secunderabad protests
Secunderabad protests

By

Published : Jun 24, 2022, 7:49 AM IST

Secunderabad riots case update: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ సుబ్బారావు పాత్రపై రైల్వే పోలీసులకు పక్కా ఆధారాలు లభించాయి. విధ్వంసం సృష్టించాలన్న ప్రణాళిక, కార్యాచరణను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారనే సాక్ష్యాలనూ వారు సేకరించారు. జూన్‌ 16న సుబ్బారావు అనుచరులతో గుంటూరు నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ సమీపంలో ఓ హోటల్‌లో దిగాడు. ముఖ్య అనుచరులు శివ, మల్లారెడ్డిలతో మాట్లాడాడు. వారి ద్వారా ఆర్మీ విద్యార్థులను రప్పించుకుని ఆ రోజు రాత్రి సమాలోచనలు జరిపాడు. మూకుమ్మడిగా రైల్వే స్టేషన్‌లోకి వెళ్లి దాడులు చేయాలని సూచించాడు. లోటుపాట్లుంటే అప్పటికప్పుడు సరిచేసేందుకు వీలుగా అనుచరులనూ మాస్కులతో స్టేషన్‌లోకి పంపించాడు. విధ్వంసం మొదలైన కొద్దిసేపటికి గుంటూరుకు పారిపోయాడని రైల్వే పోలీసులు గుర్తించారు.

సాంకేతిక ఆధారాలతో దొరికిపోయాడు..:అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళనకు సంబంధించి అన్ని వ్యవహారాల్లోనూ సుబ్బారావు ప్రమేయం ఉందని రైల్వే పోలీసులు ముందు నుంచీ అనుమానిస్తున్నారు. విధ్వంసం ప్రారంభమైన అరగంట వ్యవధిలోనే పదిహేను మంది పోలీస్‌ అధికారులు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు వాట్సాప్‌ గ్రూపుల్లో ఉన్న సభ్యుల ఫోన్‌ నంబర్లన్నింటినీ పరిశీలించారు. అభ్యర్థులు రూపొందించుకున్న ఎనిమిది వాట్సాప్‌ గ్రూపులకుగానూ నాలుగింటిలో సుబ్బారావు సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించారు. ఫోన్‌ నంబరు తెలుసుకున్న ఓ ఇన్‌స్పెక్టర్‌ ఆయనకు నేరుగా ఫోన్‌చేసి "సుబ్బారావ్‌ ఎక్కడున్నావ్‌" అనగానే ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు. వెంటనే అప్రమత్తమై మాస్కులతో స్టేషన్‌లోకి వెళ్లిన అనుచరులకు ఫోన్‌ చేసి పారిపోండంటూ ఆదేశాలిచ్చాడు. అనంతరం హోటల్‌ ఖాళీ చేసి గుంటూరుకు వెళ్లిపోయాడని దర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు.

అనుచరులు పట్టుబడటంతో అంగీకారం

ఈ కేసులో సుబ్బారావును అనుమానితుడిగా భావించిన రైల్వే పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఈ నెల 19న గుంటూరుకు వెళ్లారు. ఆ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో ఆయన చెప్పినట్టు సమాచారం. అనేక పరిణామాల అనంతరం మంగళవారం రాత్రి ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌ తీసుకొచ్చారు. బుధవారం నుంచి ప్రశ్నిస్తున్నా తనకేం సంబంధం లేదనే చెబుతూ వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు శివ, మల్లారెడ్డి సహా మరో ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రశ్నించగా.. సుబ్బారావుకు రైల్వే విధ్వంసంతో సంబంధం ఉందని, ఆయన తమకు ఫలానా ఫలానా పనులు అప్పగించాడని వారు చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సుబ్బారావు తాను ఈ నెల 16న సికింద్రాబాద్‌కు వచ్చానని అంగీకరించినట్టు సమాచారం. దీంతో గురువారం అర్ధరాత్రి సుబ్బారావు, ఆయన అనుచరులను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నారని విశ్వసనీయంగా తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details