తెలంగాణ

telangana

రాష్ట్రంలో కఠినంగా లాక్​డౌన్​... ఉల్లంఘనులపై నజర్​

By

Published : May 20, 2021, 8:55 PM IST

డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశాలతో పోలీసులు లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై కేసుల నమోదుతో పాటు వాహనాలు జప్తు చేశారు. చిన్న,చిన్న కారణాలు సాకుగా చూపి రోడ్లపైకి వచ్చి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టారు. ప్రధానరహదారులే కాకుండా కాలనీల్లోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు

రాష్ట్రంలో కఠినంగా లాక్​డౌన్​... నిబంధనల ఉల్లఘనులపై నజర్​
రాష్ట్రంలో కఠినంగా లాక్​డౌన్​... నిబంధనల ఉల్లఘనులపై నజర్​

రాష్ట్రంలో కఠినంగా లాక్​డౌన్​... నిబంధనల ఉల్లంఘనులపై నజర్​

కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ను పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ వేళల్లో విచ్చలవిడిగా రహదారులపైకి వచ్చే వాహనదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని ఆపి ఆరా తీస్తున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడ ,బేగంపేట్, గోపాలపురం,సంగీత్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు సీజ్‌ చేశారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. కూకట్‌పల్లి జాతీయరహదారిపై వాహనాలు ఆపి తనిఖీలు చేశారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పకడ్బందీగా లౌక్‌డౌన్‌ నిబంధనలు అమలుచేస్తున్నట్లు సీపీ మహేశ్‌ భగవత్‌ స్పష్టంచేశారు. అతిక్రమంచిన 21 వేల మంది వాహనదారులపై కేసులు నమోదు సీపీ వెల్లడించారు.

5 వేల మంది సిబ్బందితో...

సైబరాబాద్ పరిధిలోని మియాపూర్, చందానగర్ ఠాణాల పరిధిలో నిబంధనలను కఠినతరం చేశారు. సనత్‌నగర్ ఠాణా పరిధిలోని మూసాపేట వంతెన, ఎర్రగడ్డ రైతు బజార్, అమీర్‌పేట మైత్రివనం వద్ద పలు వాహనాలు జప్తు చేశారు. అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనదారులపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్‌ పరిధిలో లౌక్‌డౌన్‌ అమలుతీరును సీపీ సజ్జనార్‌ స్వయంగా పరిశీలించారు. 75 చెక్ పోస్టులు, 5 వేల మంది సిబ్బందితో పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. రామచంద్రాపురం పోలీసుస్టేషన్‌ పరిధిలోనూ సీపీ సజ్జనార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

జిల్లాల్లోనూ కఠినంగా...

ఎస్పీల ఆదేశాలతో జిల్లాల్లోనూ లౌక్‌డౌన్‌ ఆంక్షలను పక్కాగా అమలుచేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్‌లో నిబంధనలు అతిక్రమించిన 60 వాహనాలు జప్తు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉల్లంఘనులపై 8 వేల కేసులు నమోదు చేసినట్లు డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు. వ్యాపారులు, ప్రజలు సహకరిస్తేనే మహమ్మారిని సమర్థవంతంగా తరిమికొట్టచ్చని అధికారులు సూచించారు. సంగారెడ్డి జిల్లాలోనూ చెక్‌పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. లౌక్‌డౌన్‌ స్ఫూర్తిని ప్రజలు అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి కోరారు. నిబంధనల అమలును సీపీ స్వయంగా పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు దాదాపు 200మంది వాలంటీర్లను నియమించినట్లు వివరించారు. లాక్‌డౌన్‌ నిబంధనలపై వ్యాపారులకు రామగుండం సీపీ సత్యనారాయణ అవగాహన కల్పించారు. సింగరేణి కోల్‌బెల్ట్‌ ఏరియాలో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రజలంతా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ఎక్కడికక్కడా బారికేడ్లు...

గద్వాలలో ప్రధాన కూడళ్లలో లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరును జిల్లా ఎస్పీ రంజాన్ రతన్ స్వయంగా పర్యవేక్షించారు. సమూహాలుగా ప్రజలు రోడ్లపైకి రావొద్దంటూ సూచించారు. భౌతిక దూరం పాటించని వ్యక్తులు, దుకాణ యజమానులకు జరిమానా విధించారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనాలను పోలీసులు జప్తు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాహనాల రద్దీ నియంత్రించేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు, కాలనీల్లో నిబంధనలు ఉల్లంఘిచిన వారి వాహనాలు సీజ్ చేశారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్‌లో జిల్లా అదనపు ఎస్పీ సుధీంద్ర 10 గంటల తర్వాత రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు జరిమానా విధించారు.

ఇదీ చూడండి: ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోండిలా...

ABOUT THE AUTHOR

...view details