తెలంగాణ

telangana

ETV Bharat / city

Police Failure : వారిపై అభియోగాల నమోదులో పోలీసుల వైఫల్యం - telangana police failed to file case against politicians

చట్టసభల ప్రతినిధులు, మాజీ ప్రతినిధులపై పకడ్బందీ అభియోగాల నమోదులో రాష్ట్ర పోలీసులు విఫలమవుతున్నారు. ఇప్పటివరకు ప్రత్యేక న్యాయస్థానంలో 3.5 శాతం మందికే శిక్షలు ఖరారయ్యాయంటే.. వారి పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది.పీపీ, సరిపడా సిబ్బంది నియామకంతోనే కేసుల సత్వర విచారణ జరపవచ్చనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

Police failure to register cases
కేసుల నమోదులో పోలీసుల వైఫల్యం

By

Published : Jul 8, 2021, 7:57 AM IST

చట్టసభల ప్రతినిధులు, మాజీ ప్రతినిధులపై కేసుల నిరూపణలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వారిపై నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు వచ్చిన తీర్పులను పరిశీలిస్తే కేవలం 3.5 శాతం శిక్షలు మాత్రమే ఖరారయ్యాయి. అభియోగాల నమోదులో పోలీసుల పనితీరు ఎలా ఉందో దీని ద్వారా స్పష్టమవుతోంది. ఈ కేసుల సత్వర విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని, ఏడాదిలోపే తీర్పు వెలువరించాలని 2017, డిసెంబరు 14న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణలో 2018, మార్చి 8న హైదరాబాద్‌ నాంపల్లి కోర్టుల సముదాయంలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. దీనికి 30 మంది సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. అయితే.. ఇప్పటివరకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ), సరిపడా సిబ్బందిని నియమించకపోవడంతో కేసుల విచారణ మందకొడిగా సాగుతోందనే విమర్శలున్నాయి. దీనికితోడు చట్టసభల ప్రతినిధులపై రాష్ట్రంలో నమోదైన కేసుల బదిలీలోనూ అలసత్వం కనిపిస్తోంది.

ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటై మూడేళ్లు గడిచినా.. 183 కేసులు ఇప్పటి వరకు బదిలీ కాలేదు. బదిలీ అయిన కేసుల్లోనూ పకడ్బందీ సాక్ష్యాల సమర్పణలో పోలీసులు విఫలమయ్యారు. గోషామహల్‌ శాసనసభ్యుడు రాజాసింగ్‌పై 2019లో నమోదైన కేసులో ఆయనకు ఏడాది జైలుశిక్ష పడింది. తాజాగా ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు కోర్టు 6 నెలల సాధారణ జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. ఈయనపై 2013లో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లోనే ప్రజాప్రతినిధులకు జైలుశిక్షలు పడ్డాయి. మరో అయిదు కేసుల్లో జరిమానాలు పడగా.. మిగిలిన కేసులన్నీ వీగిపోయాయి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి రూ.4,200, ముఠా గోపాల్‌కు రూ.700, వంశీచంద్‌రెడ్డికి రూ.3,500, ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌కు రూ.650, ఓ కేసులో జోగు రామన్న, సీహెచ్‌.విజయరామారావు, గంగుల కమలాకర్‌, హన్మంత్‌షిండేకు రూ.600 చొప్పున జరిమానా పడింది. ఓ పార్లమెంట్‌ సభ్యుడిపై నమోదైన కేసును ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం అడిగితే న్యాయస్థానం ఒప్పుకోలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించి తదుపరి విచారణపై స్టే తెచ్చుకున్నారు. నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానానికి పీపీతోపాటు సరిపడా సిబ్బందిని నియమిస్తేనే కేసుల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒత్తిడితో కేసులు నీరుగార్చే ప్రయత్నం

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ) లేకపోవడంతోపాటు విచారణలో పోలీసులు శ్రద్ధ వహించకపోవడంతో కేసులు వీగిపోతున్నాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న చట్టసభల ప్రతినిధుల్లో కొందరు పోలీసు శాఖపై ఒత్తిడి తెస్తూ కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానాలున్నాయి. పీపీతోపాటు తగిన సిబ్బందిని నియమిస్తూ.. మిగిలిన కేసుల్ని ప్రత్యేక న్యాయస్థానానికి వెంటనే బదిలీ చేసేలా ఆదేశాలివ్వాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. ఇప్పటివరకు వెలువడిన తీర్పుల ఆధారంగా దర్యాప్తులో ఎక్కడ తప్పులు దొర్లాయో గుర్తించి సరిదిద్దుకోవాలి.

-ఎం.పద్మనాభరెడ్డి, సుపరిపాలన వేదిక

ABOUT THE AUTHOR

...view details