ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిపై కరోనా బాధితుల అనుచిత ప్రవర్తన, బస్తీల్లో తనిఖీలకు వెళ్తున్న అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం సిబ్బందిపై దాడులకు దిగుతున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. వీటి నివారణ కోసం మరింతమంది సిబ్బంది సేవల్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఏసీబీ, నిఘా, సీఐడీ తదితర విభాగాల అధికారులు, సిబ్బందినీ కరోనా కట్టడి విధుల్లోకి తీసుకున్నారు. వైద్య, అంగన్‌వాడీ సిబ్బందితో జిల్లాలవారీగా వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినట్లు తెలిస్తే వెంటనే వెళ్లి వారికి తగిన భద్రత కల్పించే బాధ్యతను స్థానిక పోలీసులు తీసుకోవాలని సూచించారు.
ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు..
కరోనా నివారణ విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు గట్టి భద్రత కల్పించాలని మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందిపై ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఆదేశాలతో ఇప్పటికే జిల్లాల వారీగా వైద్య సిబ్బంది రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వారికి అదనపు భద్రత కల్పిస్తున్నారు. ఆసుపత్రుల వద్ద అదనపు సిబ్బందిని మోహరించడంతో పాటు సర్వే కోసం వెళ్తున్న వారి రక్షణకు గస్తీ బృందాలను సిద్ధం చేస్తున్నారు.
వైద్య పరీక్షలు అవాస్తవం..
కరోనా కట్టడి విధుల్లో ఉన్న ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి వైద్యపరీక్షలంటూ వచ్చిన వార్తలో వాస్తవం లేదని డీజీపీ కార్యాలయం సీపీఆర్‌వో ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పోలీసులంతా పరీక్షలు చేయించుకోవాలంటూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేసినట్లు కొన్ని వాట్సప్ గ్రూపుల్లో వస్తున్న వార్తలు సత్యదూరమన్నారు. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.