Medikonduru rape case: వారు కేవలం కాలినడకన ప్రయాణం చేస్తుంటారు. బైక్‌లపై ప్రయాణించే జంటలను లక్ష్యంగా చేసుకుంటారు. దారికాచి, దోపిడీలు చేస్తారు. అవకాశం ఉంటే మహిళలపై సామూహిక అత్యాచారాలకు తెగబడతారు. ఇటీవల ఏపీ గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన మేడికొండూరు అత్యాచారం కేసు విచారణను ఛాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అత్యంత కరుడుగట్టిన కిరాతక ముఠాను అరెస్ట్ చేశారు.
పగటిపూట వ్యవసాయం.. రాత్రిళ్లు దోపిడీలు, అత్యాచారాలు
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఆకుల లింగమయ్య అలియాస్ పెద లింగమయ్య తన బావమరుదులు, బంధువులతో కలసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా జనావాసాలకు దూరంగా ఉంటూ.. పగటిపూట వ్యవసాయ పనులు, రాత్రి వేళలలో దోపిడీలు, సామూహిక అత్యాచారాలు చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. గతేడాది ఈ నిందితులు మేడికొండూరు మండలం సరిపుడి గ్రామం వచ్చి, కూలి పనులు చేస్తామంటూ ఓ రైతు వద్ద చేరారు. అతని పొలంలోనే గుడారాలు వేసుకుని కొన్నిరోజులు ఉన్నారు. సెప్టెంబర్ 8న పాలడుగు సమీపంలో బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలను అడ్డగించి బంగారం, నగదు దోచుకోవడమే గాక.. భర్త ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎలాంటి ఆనవాళ్లు దొరక్కపోవడంతో.. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఈ ముఠాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.