Police alert at BJP office: హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం ముందు ఓ కారు కలకలం రేపింది. అక్కడే పార్క్ చేసి ఉన్న కారులో బాంబ్ ఉందంటూ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అబిడ్స్ పోలీసులు జాగిలం, బాంబు నిర్వీర్య దళంతో కారును పరిశీలించారు. అందులో ఉన్న సూట్ కేసును తనిఖీ చేయగా... దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
అసలేం జరిగిందంటే.. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం పక్కన నానో కారు రెండు రోజులుగా పార్కింగ్ చేసి ఉంది. అనుమానంతో భాజపా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే అబిడ్స్ పీఎస్‌కు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకొని కారును పరిశీలించిన పోలీసులు.. అందులో దుస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్లు వివరించారు. కారు యజమాని ఫైజాన్గా పోలీసులు గుర్తించిన పోలీసులు అతన్ని విచారించారు. ఇంటి వద్ద స్థలం లేకపోవడంతో.. పార్టీ కార్యాలయం వద్ద కారును పార్క్ చేసినట్లు పోలీసులకు యజమాని తెలిపారు. అతని సమాధానంతో పోలీసులు విస్తుపోయారు.