పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని పోలీస్‌శాఖ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తోంది. రక్తదానం చేయడమే కాకుండా... పలువురిని ప్రోత్సహిస్తున్నారు పోలీసులు. వారం రోజులపాటు రక్తదాన శిబిరాలు కొనసాగనున్నట్లు వెల్లడించారు. రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు తగ్గిన వేళ పోలీసుల స్ఫూర్తిని పలువురు కొనియాడుతున్నారు.
చేస్తూ.. చేయిస్తూ..
శరీర నిర్మాణంలో రక్తం అత్యంత ప్రాముఖ్యమైనది. అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే రక్తప్రసరణ సాఫీగా జరగాలి. శరీరంలో నిర్ధారించిన స్థాయిలో రక్తం లేకపోతే ప్రాణాపాయస్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. రోగాల బారిన పడిన వారికి, శస్త్ర చికిత్సలు చేసుకునే వారికి రక్తం అవసరపడుతుంది. తలసేమియా రోగులకైతే తరచూ రక్తం ఎక్కించాలి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల రక్తదానం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఫలితంగా రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు తగ్గిపోయాయి. రక్తం అవసరమైన సందర్భాల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. నేరుగా రక్తదానం చేయడమే కాకుండా... సంబంధిత స్టేషన్ల పరిధిలోని ప్రజలను చైతన్యపరుస్తున్నారు.