Polavaram Project in AP : ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా చెబుతున్న పోలవరం ప్రాజెక్టు ఫలాలు ఇప్పట్లో అందే అవకాశం లేదా? జలాశయం నిర్మాణంతో ఏయే ప్రయోజనాలు సాధిస్తామని రాసుకున్నామో అవేమీ ఇప్పట్లో మన రాష్ట్రానికి దక్కబోవడం లేదా? కొన్నేళ్లపాటు ఈ ప్రాజెక్టు ఓ బ్యారేజి స్థాయి నిర్మాణంగానే మిగిలిపోనుందా? అనే ప్రశ్నలు రాష్ట్ర జలవనరుల నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పోలవరంలో 135 అడుగుల ఎత్తులో నీటిని నిల్వ చేసేందుకు వీలుగా చేపట్టే పనులకు రూ.10,900 కోట్ల ఖర్చవుతుందని, 150 అడుగుల ఎత్తులో నీటి నిల్వ చేసేందుకు అయ్యే నిర్మాణానికి రూ.21,000 కోట్లు అవుతాయని మంగళవారం కేంద్ర జలసంఘం అధికారులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తెలపడం చర్చనీయాంశమైంది.
పోలవరంలో 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని 322 టీఎంసీలను వినియోగించుకోవాలనే లక్ష్యం సాకారం కావడం కష్టమేనా? పోలవరం ఆధారంగానే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోని లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించడమూ గగనమేనా? గోదావరి వరద కాలంలో పెన్నాతో అనుసంధానించే ప్రాజెక్టు దిశగా అడుగులు వేయడమూ సాధ్యం కాదా? ఇలా ఎన్నో అనుమానాలు ముసురుకుంటున్నాయి.
Polavaram Project News : ఏపీ ప్రభుత్వం 2023 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతోంది. మరోవైపు ప్రాజెక్టు పూర్తయ్యేందుకు అవసరమైన రూ.47,725 కోట్ల మేర రివైజ్డు కాస్ట్ కమిటీ ఆమోదించిన మొత్తానికి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు రెండున్నరేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. దీనిపై స్పష్టత రాకుండానే కొత్తగా తొలిదశలో రూ.10,900 కోట్లకు అనుమతులనే చర్చ జరగడం జలవనరుల నిపుణుల్లో ఆందోళనకు తెరతీస్తున్నాయి. ప్రాజెక్టును +45.72 మీటర్ల స్థాయి (150 అడుగుల స్థాయికి)లో నిర్మించడానికి అవసరమైన మొత్తాలకుఆమోదం లభిస్తే అందులో తొలిదశ నిధులను ముందు ఇవ్వడానికి ఇబ్బందేమీ ఉండదు కదా.. మరి ఈ తాజా చర్చలు ఎందుకన్న ప్రశ్న నిపుణుల నుంచి వినిపిస్తోంది.
ఈ అంశాలపై తీవ్ర ఆందోళన
- పోలవరాన్ని రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. నిర్మాణానికి అవసరమయ్యే నిధులన్నీ మేమే ఇస్తామని కేంద్రమే చెప్పింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్నా కేంద్రం నుంచి పూర్తిస్థాయి నిధులపై స్పష్టతే లేదు.
- పోలవరం నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందో తాజా ధరల్లో లెక్కలు కట్టాలని పోలవరం అథారిటీ ఎప్పుడో సూచించింది. అనేక ఏళ్ల కసరత్తు-ప్రశ్నలు-సమాధానాల అనంతరం కేంద్ర జలసంఘం రూ.55,656.87 కోట్లకు సాంకేతిక సలహా కమిటీ నుంచి 2019 ఫిబ్రవరి 18న ఆమోదం తీసుకుంది.
- ఆ తర్వాత రివైజ్డు కాస్ట్ కమిటీ ఈ మొత్తాన్ని రూ.47,725.74 కోట్లకు సవరించి 2020 మార్చి 6న ఆమోదించింది. తర్వాత కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించి ఆర్థికశాఖకు పంపితే అక్కడ అనుమతి లభిస్తే నిధులు విడుదలవుతాయి.
- దాదాపు రెండేళ్ల నుంచి సంబంధిత పెట్టుబడి అనుమతి సాధించుకోలేకపోయామన్న విమర్శలు వస్తున్నాయి. భారీ కసరత్తు పూర్తయిన తర్వాత బంతి మళ్లీ పోలవరం అథారిటీ కోర్టులోకే వచ్చింది. అక్కడి నుంచి ముందుకే కదలడం లేదు. జలవనరులశాఖ అధికారులు మాత్రం ఇది రాజకీయ నిర్ణయమే తప్ప తామేమీ చేయలేమని అనధికారికంగా చెబుతూ వస్తున్నారు.
- పోలవరంలో 135 అడుగులకు పైన 150 అడుగుల మధ్యన 75 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేసుకోవచ్చు. 135 అడుగులకే తొలిదశ నీటి నిల్వతో లైవ్ స్టోరేజి ఉండదు.
- పోలవరం కుడి, ఎడమ కాలువల ద్వారా పూర్తి స్థాయి సామర్థ్యంతో నీటిని ఇవ్వాలంటే 133 అడుగుల వరకు నీటి నిల్వ ఉండాల్సిందే. అంతకన్నా తగ్గితే ఆ మేరకు కాలువలకు పూర్తి సామర్థ్యంతో నీళ్లు ఇవ్వలేం. అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి ప్రయోజనాలు దక్కనట్లే.