తెలంగాణ

telangana

ETV Bharat / city

విచారణ సాగదీయడం సరికాదు: ఏపీ హైకోర్టు - తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని పోలవరం ప్రాజెక్టు విషయంలో 30 వేల కోట్ల రూపాయలకుపైగా కోత పెట్టాలని కేంద్రం భావిస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఏపీ హైకోర్టులో వాదించారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించినందున.. ఖర్చు మొత్తం కేంద్రమే భరించాల్సి ఉందని గుర్తుచేశారు.

విచారణ సాగదీయడం సరికాదు: ఏపీ హైకోర్టు ఋ
polavaram-project-case-hearing-on-high-court

By

Published : Jan 28, 2021, 6:19 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించినందున మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఆదేశాలివ్వలని కేవీపీ రామచంద్రరావు దాఖలు చేసిన పిల్‌లో.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు వాదనలు వినిపించిన ఉండవల్లి.. పోలవరం ప్రాజెక్టు 2013-14 అంచనా ధరల ప్రకారం రాష్ట్రానికి రావాల్సింది రూ. 7.53 వేల కోట్లు మాత్రమేనని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పేర్కొనడం సరికాదన్నారు. సుమారు 30 వేల కోట్ల రూపాయలకు పైగా కోతపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు.

2004 నుంచి పోలవరం ప్రాజెక్టు విషయంలో పని చేశానన్న ఉండవల్లి.. విభజన చట్టంలోని సెక్షన్‌-90లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినట్లు స్పష్టంగా ఉందన్నారు. ఆ ప్రకారంగా ప్రాజెక్టు అభివృద్ధి, వ్యయం మొత్తాన్ని కేంద్రమే భరించాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంతంలో భారీగా నీటిని పంపింగ్‌ చేస్తుండటం కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో రబీ సాగుకు నీటికొరత ఏర్పడిందని కోర్టు దృష్టికి తెచ్చారు.

ఉండవల్లి వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఇకపై విచారణను సాగదీయడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. హైకోర్టులో పిల్‌ను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని తెలపాలని సహాయ సొలిసిటర్ జనరల్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:ఫిట్​మెంట్ పేరుతో కొత్త డ్రామా: డీకే అరుణ

ABOUT THE AUTHOR

...view details