తెలంగాణ

telangana

ETV Bharat / city

'తాజా ధరలతోనే పోలవరం.. ఈ మేరకు మీరే సిఫార్సు చేయండి' - పోలవరం నిధులపై రాష్ట్ర అధికారులు డిమాండ్ న్యూస్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2017 -18 నాటి ధరల ప్రకారం నిధులివ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని గట్టిగా కోరింది. రూ.20,398.61 కోట్లు మాత్రమే ఇస్తే ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. అవసరమైతే ఈ విషయాన్ని కేంద్రానికి స్పష్టం చెయ్యాలనీ కుండబద్దలు కొట్టింది. పోలవరం నిర్మాణ వ్యయమే ప్రధానాంశంగా సోమవారం పోలవరం అథారిటీ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. కేంద్ర ఆర్థికశాఖ విధించిన షరతు (ప్రాజెక్టు నిర్మాణానికి రూ.20,398 కోట్లే ఇవ్వాలని..) వరకు సమావేశంలో చర్చకు పరిమితమవుదామని అథారిటీ పెద్దలు చెప్పారు.

'తాజా ధరలతోనే పోలవరం.. ఈ మేరకు మీరే సిఫార్సు చేయండి'
'తాజా ధరలతోనే పోలవరం.. ఈ మేరకు మీరే సిఫార్సు చేయండి'

By

Published : Nov 3, 2020, 9:23 AM IST


తాజా ధరలు ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్రానికి సిఫార్సు చేయాల్సిందేనంటూ ఏపీ జలవనరులు, ఆర్థిక శాఖల అధికారులు గట్టిపట్టు పట్టారు. ఈ క్రమంలో అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌కు ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు మధ్య ఆసక్తికర చర్చ సాగింది. చివరకు 2013-14 ధరలకు ఆమోదం తెలియజేస్తూనే.. 2017-18 ధరల మేరకు అంచనాలు ఆమోదించకపోతే ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని సిఫార్సు చేసేందుకు అథారిటీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఏపీ వాదనతో పోలవరం అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఏకీభవించినట్లు కనిపించిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే మినిట్స్‌లో ఏ విధంగా నమోదు చేస్తారో చూడాలని చెబుతున్నారు.


పోలవరం ప్రాజెక్టు అథారిటీ సర్వసభ్య సమావేశం సోమవారం హైదరాబాద్‌లో అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన నిర్వహించారు. కార్యదర్శి రంగారెడ్డి, కేంద్ర జలవనరులశాఖ సంయుక్త కార్యదర్శి జగ్‌మోహన్‌ గుప్తా సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి, పోలవరం చీఫ్‌ ఇంజినీరు సుధాకర్‌బాబు, ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు తదితరులు ఏపీ వైపు నుంచి వాదనలు వినిపించారు. కేంద్ర జలసంఘం అధికారులు పచౌరి, హల్దార్‌ తదితరులు దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సులో హాజరయ్యారు.

కొర్రీకే పరిమితమవుదాం

సమావేశం ప్రారంభిస్తూనే సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ 2013-14 ధరలతో రూ.20,398 కోట్లకు అంచనాలు ఆమోదించాలంటూ ప్రతిపాదించారు. ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో కేంద్ర సంస్థలు లెక్కించి, ఆమోదించాయన్నారు. ఆ ధరలను సిఫార్సు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఇందుకు అథారిటీ సీఈవో అంగీకరించలేదు. కేంద్ర జలశక్తిశాఖ నుంచి వచ్చిన నోట్‌ ప్రకారం అథారిటీకి ఎంత వరకు స్కోప్‌ ఉందో అంత వరకు చర్చించి ఆమోదించి పంపడమే మన విధి అన్నారు. అలా చేస్తే ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని ఆదిత్యనాథ్‌దాస్‌ ప్రశ్నించారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కూడా లేకుండా చేశారని, దాంతో రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిందని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ చెప్పారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తిగా నిర్మించి ఇస్తుందని స్పష్టంగా చెప్పి, ఇప్పుడు దాని విషయంలోనూ అన్యాయం చేస్తే ఎలా అన్నారు.

కేంద్ర ఆర్థికశాఖ షరతు విధించిందని, అది సమావేశంలో చర్చించి ఆమోదించాలని జలశక్తి శాఖ సూచించిందని అయ్యర్‌ అన్నారు. ఆదిత్యనాథ్‌ స్పందిస్తూ.. ‘ఈ నిధులతో మీరు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయగలరా? చెప్పండి. నిర్మాణ బాధ్యత తీసుకోవాల్సిన పోలవరం అథారిటీ సరిగా వ్యవహరించకపోతే ప్రాజెక్టు నిర్మాణం ఎలా పూర్తవుతుంది’ అని ప్రశ్నించారు. ఇంతకుముందు పోలవరం అథారిటీ 2017-18 ధరలతో ప్రతిపాదనలు ఆమోదించి కేంద్ర జలసంఘానికి పంపిందన్నారు. రూ.20,398.61 కోట్లు మాత్రమే ఇస్తే ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్‌ తేల్చిచెప్పినట్లు మినిట్స్‌లో కూడా పేర్కొనాలని ఆదిత్యనాథ్‌దాస్‌ స్పష్టం చేశారు. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ సమావేశం ముందు ప్రతిపాదనలు ఉంచితే రూ.55,548 కోట్లకు ఆమోదించిందన్నారు. ఆ తర్వాత రివైజ్డు కాస్ట్‌ కమిటీ రూ.47,725 కోట్లకు దాన్ని ఆమోదించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రూ.47,725 కోట్లకే జలశక్తిశాఖకు పెట్టుబడి అనుమతిచ్చి ఆ మేరకు నిధులివ్వాలని కోరుకుంటోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు తాజా ధరలకు సంబంధించిన అంశాలను వివరించారు. ఏపీ అధికారుల వాదనకు అయ్యర్‌ అభ్యంతరం తెలిపారు.

2017లో కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన నోట్‌ ప్రకారం ముందుకెళ్లాల్సిందే కదా అన్నారు. 1.4.2014 తర్వాత ఏ రకంగా అంచనాలు పెరిగినా, ధరలు పెరిగినా ఇవ్వబోమని నాడు నోట్‌లో పేర్కొన్నారని ప్రస్తావించారు. అలాంటి నోట్‌ ఒకటి ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదని, పోలవరం అథారిటీకి కూడా అలాంటిదేమీ పంపలేదని ఆదిత్యనాథ్‌దాస్‌, వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని కేంద్ర మంత్రిమండలి ఆమోదించిందని, పార్లమెంటు చట్టంలో కూడా పేర్కొన్నారని దాస్‌ ప్రస్తావించారు. పార్లమెంట్‌ చట్టాన్ని కేబినెట్‌ తీర్మానం ఎలా అధిగమించగలదని ఆయన ప్రశ్నించారు. అన్ని జాతీయ ప్రాజెక్టులకు ఒక నిబంధన, పోలవరం ప్రాజెక్టుకు మరో నిబంధన ఏమిటని ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టులకు మూడేళ్లకోసారి అంచనాలు సవరిస్తూ ఉంటారని చెప్పారు. ‘ఉత్తరాఖండ్‌లో రెండు ప్రాజెక్టులకు 2018-19 ధరలు కూడా ఇచ్చారు. ఒక ప్రాజెక్టులో 340 శాతం అధికంగా అంచనాలు పెంచారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాసం ఎప్పుడు అమలు చేస్తే అప్పటి ధరల ప్రకారం పరిహారం చెల్లించాల్సిందే. పనులు చేసినప్పటి ధరలు ఇవ్వాలి తప్ప పాత ధరలు ఇస్తామనడం ఎంతవరకు సమర్థనీయం?’ అని దాస్‌ ప్రశ్నించారు.

తాగునీటి విభాగం ఖర్చును ఎలా మినహాయిస్తారు?

దేశంలో ఏ ప్రాజెక్టులోనూ లేని విధంగా పోలవరంలో తాగునీటి విభాగం ఖర్చును ఎలా మినహాయిస్తారని ఆదిత్యనాథ్‌ దాస్‌ అడిగారు. విశాఖ అవసరాలు తీర్చేందుకు ఏకంగా 24 టీఎంసీలంటూ పెద్ద మొత్తంలో లెక్క కట్టారని అథారిటీ ముఖ్యులు అభ్యంతరం తెలిపారు. తాగునీటి విభాగం కింద జాతీయ ప్రాజెక్టుల్లో ఆ ఖర్చుకు కూడా సాయం చేస్తున్నారని, ఇందులో ఎన్ని టీఎంసీలన్న పరిమితి నిబంధన ఎక్కడా లేదని వెంకటేశ్వరరావు ప్రస్తావించారు. తాగునీటి విభాగం ఖర్చులకు ఇవ్వాల్సిందేనని కేంద్ర జలసంఘం అధికారులూ చెప్పారు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే 2017-18 నాటి ధరలు ఇవ్వాల్సిందేనన్న ఉద్దేశంతోనే తాము ఆ మేరకు సిఫార్సు చేశామని వారు పేర్కొన్నట్లు తెలిసింది. సమావేశంలో పాల్గొన్న తెలంగాణ జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ మాట్లాడుతూ పోలవరం వల్ల తమ భూభాగంలో పెద్ద ఎత్తున ముంపు ఏర్పడుతోందని, అక్కడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణం వల్ల ఎంతవరకు ముంపు ఏర్పడుతుందనేది ఇప్పటికే అనేక అధ్యయనాలు జరిగాయని, ఆ ప్రకారమే ముందుకు వెళ్తున్నామని ఏపీ అధికారులు సమాధానమిచ్చారు.

2022 ఏప్రిల్‌కల్లా పూర్తి చేయాలి
2022 ఏప్రిల్‌ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనే షెడ్యూలుకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని అథారిటీ పేర్కొంది. 2014 ఏప్రిల్‌ 1కి ముందు పోలవరంపై చేసిన ఖర్చు రూ.4,730.71 కోట్ల ఆడిట్‌ లెక్కలను అథారిటీ ఆమోదించింది. పోలవరం నిధులు అథారిటీ నుంచి నేరుగా జమ చేసేందుకు ప్రత్యేక పీడీ ఖాతా ఏర్పాటుకు అనుమతి లభించింది. పోలవరం నిధులు ఇక నేరుగా అవే ఖాతాకు జమవుతాయి.

రూ.55,548 కోట్లకు సిఫార్సు చేయాలి

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరులశాఖ సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన మేరకు రూ.55,548.87 కోట్ల నిధులు ఇవ్వాల్సిందేనని ఏపీ రైతుసంఘాల నాయకులు, ప్రతినిధులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు.మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర రైతాంగ సమాఖ్య, అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రనాథ్‌, కొల్లి నాగేశ్వరరావు, అధ్యయన కేంద్రం సమన్వయకర్త టి.లక్ష్మీనారాయణ, తెలుగు రైతు విభాగం, రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు గుర్నాథరావు తదితరులు అయ్యర్‌ను కలిశారు.

-రైతు సంఘాల వినతిపత్రం

రూ.2,234 కోట్లు ఇచ్చేందుకు షరతుల సడలింపు
పోలవరం ప్రాజెక్టుకు రూ.2,234.288 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విన్నపం, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇంతకు ముందు విధించిన షరతులు సడలిస్తున్నామని ఉత్తర్వులిచ్చింది. సడలింపు కేవలం ఈ నిధుల విడుదల వరకే పరిమితమవుతుందని స్పష్టం చేసింది. తదుపరి ఎలాంటి నిధులు విడుదల చేయాలన్నా పోలవరం అథారిటీకి గతంలో సూచించిన మేరకు (రూ.20,398 కోట్లతో) అంచనాలు ఆమోదించి పంపవలసి ఉంటుందని పేర్కొంది.

ఇదీ చదవండి:రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details