తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలవరంపై నేడు హైదరాబాద్​లో కీలక భేటీ..

పోలవరానికి కేంద్ర నిధుల సాధనే ప్రధాన ఎజెండాగా హైదరాబాద్‌లో ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ ప్రాజెక్టుకు తాజా ధరల ప్రకారం నిధులు సమకూర్చే విషయంలో కేంద్రం పెడుతున్న కొర్రీలు, ఇవే అంశాలను ఆమోదించి పంపాలని కేంద్ర ఆర్థిక శాఖ షరతులు పెడుతున్న సమయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

polavaram-project-authority-meet-in-hyderabad
పోలవరంపై నేడు హైదరాబాద్​లో కీలక భేటీ

By

Published : Nov 2, 2020, 7:39 AM IST

హైదరాబాద్‌లోని కేంద్ర జలసంఘం కార్యాలయంలో ఉదయం 11గంటలకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సభ్య కార్యదర్శి రంగారెడ్డి, ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి, తెలంగాణ జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా పాల్గొంటారు. రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న జలశక్తి సంయుక్త కార్యదర్శి జగ్‌మోహన్‌గుప్తా హాజరవుతారు. 2017-18తోపాటు 2014-15 ధరల రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ సిఫార్సులపై సమావేశంలో ఆయన ప్రజంటేషన్‌ సమర్పిస్తారు.

పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే

ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కొర్రీని యథాతథంగా ఆమోదించి పంపుతారా? చర్చల తర్వాత అప్పటి అంచనా వ్యయంతో ప్రాజెక్టును నిర్మించడం కష్టమని తేలుస్తారా? అన్నది చూడాలి. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి హాజరవుతున్న అధికారులు పూర్తి స్థాయిలో ప్రభుత్వ వాదనను వినిపించేందుకు సిద్ధమయ్యారు. నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేయనున్నారు. జాతీయ ప్రాజెక్టుల నిర్మాణ మార్గదర్శకాలు, దేశంలోని ఇలాంటి 16 ప్రాజెక్టులకు ఇంతవరకు ఎన్నిసార్లు అంచనాలు సవరించారు? తదితర అంశాలను ప్రస్తావించేలా సమగ్ర సమాచారాన్ని సేకరించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏం పేర్కొన్నారు? పోలవరం అథారిటీ ఏ ఉద్దేశంతో ఏర్పడింది? 2013 భూసేకరణకు కేంద్రం చేసిన చట్టం పోలవరంపై ఎలాంటి ప్రభావం చూపింది? ఈ దశలో చాలినంత నిధులివ్వకపోతే భవిష్యత్తేమిటి? తదితర అంశాలతో వాదనను వినిపించేందుకు ఏపీ సిద్ధమవుతోంది.

తుది నిర్ణయం జలశక్తి శాఖదే

కేంద్ర జలశక్తి శాఖ పెట్టుబడి అనుమతినివ్వడంలో భాగంగా 2017-18 ధరలకు అంచనాలను పోలవరం అథారిటీ ఆమోదించి పంపుతుందని, ఇది ఒక సాంకేతిక అంశమేనని ఏపీ జలవనరుల అధికారులు పేర్కొంటున్నారు. తుది నిర్ణయం కేంద్ర జలశక్తి శాఖకు వదిలేసే అవకాశమూ ఉందని అథారిటీలోని కొన్ని వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details