తెలంగాణ

telangana

ETV Bharat / city

'పోడు' భూముల పరిష్కారమెప్పుడు? - తెలంగాణలో పోడు భూముల సమస్యలు

Podu Lands Issue : రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు పరిష్కారం మరింత జాప్యం కానుంది. గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన సర్కార్ వాటి పరిశీలనకు అనుమతులు, మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఆరు నెలలుగా ఇవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వీటి పరిశీలన మొదలుపెట్టాలని అధికారులు చూస్తున్నారు.

Podu Lands Issue
Podu Lands Issue

By

Published : May 24, 2022, 8:44 AM IST

Podu Lands Issue : రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు పరిష్కారం మరింత ఆలస్యం కానుంది. అటవీ హక్కుల చట్టం కింద అర్హులైన గిరిజనుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం.. వాటి పరిశీలనకు ఎలాంటి అనుమతులు, మార్గదర్శకాలు జారీ చేయలేదు. దరఖాస్తులన్నీ గ్రామ కమిటీల వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు వానాకాలం పంటల సాగుకు దుక్కిదున్నేందుకు వెళ్తున్న గిరిజనుల్ని అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. పోడుపై చట్టబద్ధ హక్కులు వచ్చేవరకు భూముల్లోకి వెళ్లవద్దని స్పష్టంచేస్తున్నారు.

Podu Lands Issue in Telangana : రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాల్లో గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములపై హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం గత నవంబరు 8 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రంలో 2,450 గిరిజన గ్రామాల(4,300 ఆవాసాల) పరిధిలో పోడు భూముల సమస్యలున్నట్లు గుర్తించింది. ఆయా ఏజెన్సీ గ్రామాల కమిటీలు నవంబరులో దరఖాస్తుల స్వీకరణను పూర్తిచేశాయి.

అటవీ హక్కుల చట్టం-2005 ప్రకారం దాదాపు 5-6 లక్షల ఎకరాల విస్తీర్ణంపై హక్కుల కోసం దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం భావించింది. కానీ, భారీస్థాయిలో దాదాపు 12 లక్షల ఎకరాల విస్తీర్ణంపై 3.4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటి కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తయింది. తక్కువ దరఖాస్తులు వచ్చిన గ్రామాలు, ఆవాసాల్లో నెల రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని.. ఆరు నెలల్లోగా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై గిరిజన, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించినా.. క్షేత్రస్థాయి పరిశీలనకు ఇంకా మార్గదర్శకాలు వెలువరించలేదు.

జిల్లా కలెక్టర్లకు గిరిజనుల విన్నపాలు :అటవీ హక్కుల కమిటీలు, గ్రామస్థాయి కమిటీలు ఆయా గ్రామాల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా షెడ్యూలు ప్రకటించి పరిశీలన చేపట్టాల్సి ఉంది. ఈ విషయంలో రెవెన్యూ, అటవీ, గిరిజన శాఖలు సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పోడు భూముల సమస్యపై గిరిజన శాఖ నోడల్‌ విభాగంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేవరకు ముందుకు వెళ్లవద్దని ఈ శాఖలు భావిస్తున్నాయి. పోడు భూముల పంపిణీకి జిల్లాల్లో 1-2 గ్రామాలను పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి, క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశీలన వివరాలపై, అర్హులైన గిరిజనుల జాబితాపై గ్రామసభల్లో చర్చించి ఆమోదం తీసుకోవాల్సి ఉంది.

అయితే, ప్రభుత్వ ఆదేశాలు రాకపోవడంతో పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపికైన గ్రామాల్లోనూ దరఖాస్తుల పరిష్కారం నిలిచిపోయింది. మరోవైపు గిరిజనులు ఆయా జిల్లాల కలెక్టర్లను కలిసి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. గతంలో అటవీ హక్కుల చట్టం కింద దరఖాస్తు చేసినప్పటికీ పరిష్కరించలేదని, ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వానాకాలంలో పంటల సాగుకు అనుమతి ఇవ్వాలని, అటవీ అధికారులు అడ్డుకోకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details