తెలంగాణ

telangana

ETV Bharat / city

మన్యం వీరుడే మనకు స్ఫూర్తి.. ‘ఒకే భారత్‌.. శ్రేష్ఠ భారత్‌’ భావనకు ఆయన ప్రతీక - మన్యం వీరుడి విగ్రహావిష్కరణ

స్వాంతంత్య్ర సమరయోధుల కలల దేశంగా నవభారత్‌ ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. యావత్‌ భారత జాతిని ఒక్కతాటిపై నిలుపుతున్న ‘ఒకే భారత్‌.. శ్రేష్ఠ భారత్‌’ భావనకు అల్లూరి అసలైన ప్రతీక అని కొనియాడారు. ఆ భావన అనాదిగా దేశ చరిత్రలోనూ, సాంస్కృతిక చింతనలోనూ మమేకమైందన్నారు. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి 125వ జయంతి వేడుకలను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు 30 అడుగుల పొడవైన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

మన్యం వీరుడే మనకు స్ఫూర్తి.. ‘ఒకే భారత్‌.. శ్రేష్ఠ భారత్‌’ భావనకు ఆయన ప్రతీక
మన్యం వీరుడే మనకు స్ఫూర్తి.. ‘ఒకే భారత్‌.. శ్రేష్ఠ భారత్‌’ భావనకు ఆయన ప్రతీక

By

Published : Jul 5, 2022, 7:35 AM IST

బ్రిటిష్‌ పాలకుల్ని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశంలోని కోట్లాది ఆదివాసీల ధైర్యానికి, స్థైర్యానికి, సంస్కృతికి ప్రతీక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ‘దమ్ముంటే నన్ను ఆపండి’ అని గర్జించి బ్రిటిష్‌ సైనికుల తుపాకులకు ఎదురొడ్డిన ఆ మహావీరుడి ధైర్యసాహసాలే స్ఫూర్తిగా.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై 130 కోట్ల మంది ప్రజలు ఐకమత్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా, అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం నిర్వహించిన ఉత్సవాల్లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెదఅమిరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని సభా వేదికపై నుంచి రిమోట్‌ కంట్రోల్‌తో వర్చువల్‌గా ప్రారంభించారు. ‘మన్యం వీరుడు, తెలుగుజాతి యుగపురుషుడు..’ అంటూ మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి, మన్యంలో రంప తిరుగుబాటు జరిగి వందేళ్లయిన సందర్భంగా ఈ సంవత్సరమంతా దేశంలో పలు చోట్ల ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. యావత్‌ భారతజాతిని ఒక్కతాటిపై నిలుపుతున్న ‘ఒకే భారత్‌.. శ్రేష్ఠ భారత్‌’ భావనకు అల్లూరి అసలైన ప్రతీక అని కొనియాడారు. ఆ భావన అనాదిగా దేశ చరిత్రలోనూ, సాంస్కృతిక చింతనలోనూ మమేకమైందన్నారు.

‘సీతారామరాజు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ‘మనదే రాజ్యం’ అన్న నినాదంతో ఆయన దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. వందేమాతరం, మనదే రాజ్యం అన్న భావన ఒక్కలాంటివే’ అని మోదీ కొనియాడారు.‘మన్యం వీరుడిగా ఆంగ్లేయులతో పోరాటం ప్రారంభించినప్పుడు అల్లూరి సీతారామరాజు వయసు 24-25 సంవత్సరాలే. అంత చిన్న వయసులోనే ఆయన దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఆయనతో కలసి బ్రిటిషర్లపై పోరాడిన ఎందరో యువకులు తమ జీవితాలను పణంగా పెట్టారు. వారి త్యాగాల నుంచి యావత్‌ జాతి.. శక్తిని, స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. అప్పట్లో యువతే స్వాతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపించింది. దేశాభివృద్ధికి యువత మళ్లీ నడుం కట్టేందుకు ఇది మంచి సమయం. ప్రస్తుతం యువతకు ఎన్నో అవకాశాలు, వారి ప్రతిభను చాటుకోవడానికి మరెన్నో వేదికలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకుని కలల్ని సాకారం చేసుకోవాలి. యువకులు, మహిళలు, దళితులు, ఆదివాసీలతోపాటు, అణచివేతకు గురైన వర్గాలన్నీ ముందుకొచ్చి దేశానికి నాయకత్వం వహిస్తే.. భారత్‌ అభివృద్ధిని ఎవరూ నిలువరించలేరు’ అని ప్రధాని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ దేశభక్తుల పురిటిగడ్డ

ఆంధ్రప్రదేశ్‌ ఎందరో దేశభక్తులకు, స్వాతంత్య్ర సమరయోధులకు పురిటిగడ్డ అని ప్రధాని కొనియాడారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు వంటివారు జన్మించిన పుణ్యభూమి ఈ ప్రాంతమని కొనియాడారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయుల తుపాకులకు ఎదురొడ్డి పోరాడిన గొప్ప యోధుడన్నారు. ‘దేశం కోసం బలిదానాలు చేసిన ఆ యోధులందరి కలల్ని ఈ అమృత కాలంలో సాకారం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. గత ఎనిమిదేళ్లుగా భారత ప్రభుత్వం దేశంలోని గిరిజనుల సంక్షేమానికి అవిశ్రాంత కృషి చేస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారిగా గిరిజనుల సంస్కృతిని, ఘన వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు గిరిజన మ్యూజియంలు ఏర్పాటు చేస్తోంది. దానిలో భాగంగానే లంబసింగిలో అల్లూరి సీతారామరాజు స్మారక గిరిజన స్వాతంత్య్ర యోధుల మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఆంగ్లేయులు దేశంలోని గిరిజనులపై అనేక అరాచకాలు, అకృత్యాలకు పాల్పడారని, గిరిజనుల సంస్కృతిని నాశనం చేసేందుకు ప్రయత్నించారని ఆయన ధ్వజమెత్తారు.

అల్లూరి నడయాడిన ప్రాంతాల అభివృద్ధి

అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేసి జాతికి అంకితమిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ‘విశాఖ జిల్లా పాండ్రంగిలో ఆయన జన్మస్థలాన్ని, రంప తిరుగుబాటులో భాగంగా ఆయన దాడి చేసిన చింతపల్లి పోలీస్‌స్టేషన్‌ను పునరుద్ధరిస్తాం. మోగల్లులో అల్లూరి ధ్యాన మందిరాన్ని నిర్మిస్తాం. అమృత మహోత్సవాల స్ఫూర్తి చిహ్నంగా వీటి నిర్మాణాలు చేపడతాం. మన స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల్లోని చారిత్రక ఘట్టాలను దేశ ప్రజలందరికీ తెలియజేయాలన్న సంకల్పానికి అల్లూరి 125వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నిదర్శనం. మన స్వాతంత్య్ర సంగ్రామం కొంత కాలానికో, కొన్ని ప్రాంతాలకో, కొందరు వ్యక్తులకో పరిమితమైంది కాదు.. ఇది దేశంలోని నలుమూలలకూ చెందిన ఎందరో త్యాగధనుల చరిత్ర. మన దేశ భిన్నత్వం, ఐకమత్యం, సంస్కృతిలోని శక్తికి స్వాతంత్య్రోద్యమం అసలు సిసలు ప్రతీక’ అని ఆయన పేర్కొన్నారు.

మాతృభాషలో బోధనతో ఎంతో మేలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్కిల్‌ ఇండియా మిషన్‌’ వల్ల గిరిజన కళలు, నైపుణ్యాలకు కొత్త గుర్తింపు లభిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ కార్యక్రమం... గిరిజనుల కళాత్మక నైపుణ్యాలద్వారా ఆదాయ సముపార్జనకు మార్గం చూపిందన్నారు. ‘ఆకాంక్షిత జిల్లాల’ పథకం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, వారి విద్యాభివృద్ధికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. గిరిజనుల పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు దేశవ్యాప్తంగా 750 ఏకలవ్య పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మాతృభాషలో బోధనకు పెద్దపీట వేస్తున్నామని.. ఇది గిరిజన ప్రాంతాల పిల్లలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన వివరించారు.

90 అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర

గిరిజన యువతకు జీవనోపాధి మార్గాల్ని పెంచేందుకు గత ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు మోదీ తెలిపారు. ‘ఇది వరకు అడవిలో పెరిగే వెదురును నరికి అమ్ముకునే హక్కు గిరిజనులకు ఉండేది కాదు. మేం చట్టాన్ని మార్చి, వారికి ఆ హక్కు కల్పించాం. కేవలం 12 అటవీ ఉత్పత్తులకే కనీస మద్దతు ధర ఉండేది. మేం ఆ సంఖ్యను 90కి పెంచాం. 3 వేలకుపైగా వనగణ వికాస కేంద్రాలు, 50వేలకు పైగా వనగణ స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశాం. గిరిజన కళాకృతులు, ఉత్పత్తులకు సరికొత్త అవకాశాలు కల్పించేందుకు ఈ గ్రూపులు ఎంతో తోడ్పడుతున్నాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు.

పలుమార్లు ‘ఆదివాసీ’ ప్రస్తావన

ప్రధాని మోదీ ప్రసంగాన్ని భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలుగులోకి అనువదించారు. మోదీ ప్రసంగం, అనువాదం కలిపి 40 నిమిషాలపాటు సాగింది. ప్రసంగం ప్రారంభంలో ‘భారత్‌ మాతాకీ జై’ అని రెండుసార్లు నినదించిన మోదీ... ముగించేటప్పుడూ మరో మూడు సార్లు అదే నినాదం చేశారు. ప్రసంగం చివర్లో ప్రధాని బిగ్గరగా ‘వందే’ అని నినదిస్తూ, సభకు హాజరైన వారితో‘మాతరం’ అని అనిపించారు. ఈ ‘వందే’ ‘మాతరం’ నినాదం ఏడు సార్లు కొనసాగింది. ప్రధాని తన ప్రసంగంలో పలుమార్లు ఆదివాసీ ప్రస్తావన చేశారు. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన నేత ద్రౌపదీ ముర్మును ఎంపిక చేసిన విషయాన్ని ఆయన నేరుగా ప్రస్తావించకపోయినా, ఆదివాసీలకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని చెప్పే ప్రయత్నం చేశారు. గిరిజనుల అభ్యున్నతికి గత ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్ని మోదీ వివరించారు. బిర్సాముండా జయంత్యుత్సవాల్ని ఘనంగా నిర్వహించిన విషయాన్నీ గుర్తు చేశారు.

పుణ్యభూమి ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి. ఇక్కడికి రావడం నా అదృష్టం. ఈ వీరభూమికి శిరసు వంచి నమస్కరిస్తున్నా. సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల సందర్భంగా యావత్‌ భారతదేశం తరపున ఆయనకు పాదాభివందనం చేస్తున్నా. వారి కుటుంబ సభ్యులతో వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఆదివాసీ సోదరుల వీరగాథలు ప్రేరణనిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన ఆదివాసీ వీరులందరికీ నమస్సుమాంజలి ఘటిస్తున్నా.

- ప్రధాని మోదీ

మాతృభాషలో బోధనకు పెద్దపీట వేస్తున్నాం. ఇది గిరిజన ప్రాంతాల పిల్లలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. గిరిజనుల పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు 750 ఏకలవ్య పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నాం.

- ప్రధాని

మన్యం వీరుడు, తెలుగుజాతి యుగపురుషుడు, తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా.. అంటూ స్వతంత్ర సంగ్రామంలో యావత్‌ భారతావనికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన నేలపై మనమందరం కలుసుకోవడం మన అదృష్టం..’

- తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభిస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు.

కన్నుల పండువగా..

స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆద్యంతం వేడుకగా సాగింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి సోమవారం ఉదయం 11.17 గంటలకు భీమవరం శివారు పెదఅమిరంలోని బహిరంగ సభావేదికపైకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11.43 గంటలకు భీమవరం ఏఎస్‌ఆర్‌నగర్‌లో క్షత్రియ సేవా సమితి తరఫున రూ.3.50 కోట్లతో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని బటన్‌ నొక్కి వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ‘మన్యం వీరుడు.. తెలుగు జాతి యుగపురుషుడు.. తెలుగువీర లేవరా! దీక్షబూని సాగరా! అంటూ స్వతంత్ర పోరాటంలో యావత్‌ భారతజాతికే స్ఫూర్తినిచ్చిన అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేలపైన మనందరం కలుసుకోవటం మన అదృష్టం’ అని పేర్కొంటూ మోదీ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత హిందీలో మాట్లాడారు.

ప్రధానికి విల్లు బాణం... సీతారామపట్టాభిషేకం చిత్రం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మోదీని ఘనంగా సత్కరించారు. సీతారామ పట్టాభిషేకం చిత్రాన్ని జ్ఞాపికగా బహుకరించారు. విల్లు, బాణాన్ని కూడా అందించారు. ప్రధాని వాటిని చేతబూని ప్రదర్శించారు.

చిరంజీవితో ముచ్చట్లు.. రోజాకు సెల్ఫీ

ప్రసంగం ముగిసిన అనంతరం ప్రధాని మోదీ.. సినీనటుడు చిరంజీవితో కాసేపు చాలా ఆప్యాయంగా ముచ్చటించారు. ఆయన భుజాలను తడుతూ మాట్లాడారు. అంతకు ముందు ప్రధాని వేదికపైకి వచ్చి కూర్చోగానే చిరంజీవి ఆయన వద్దకు వెళ్లి నమస్కరించారు. మోదీ కాస్సేపు ఆయనతో మాట్లాడారు. పక్కనే ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ కూడా చిరంజీవిని ఉద్దేశించి ప్రధానికి ఏదో చెబుతూ కనిపించారు. కార్యక్రమం చివర్లో మంత్రి ఆర్‌కే రోజా ప్రధానిని అడిగి మరీ ఆయన, సీఎం జగన్‌తో కలిపి ఓ సెల్ఫీ తీసుకున్నారు. తర్వాత ప్రధాని కొంచెం ముందుకు వెళ్లిపోగా మరోసారి ఆయన వద్దకు వెళ్లి రెండోసారి సెల్ఫీ దిగారు. అల్లూరి జయంతి ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌ నాగరాజు కూడా ప్రధానితో సెల్ఫీ తీసుకున్నారు. అంతకు ముందు చిరంజీవి ప్రధానికి శాలువ కప్పి సత్కరించారు.

కేంద్ర మంత్రికి ట్రాఫిక్‌ చిక్కులు..

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నుంచి బహిరంగ సభ జరిగే పెద అమిరం వెళ్లే మార్గంలో వాహనాల తాకిడికి ట్రాఫిక్‌ సమస్య ఎదురైంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ట్రాఫిక్‌లో 15 నిమిషాల పాటు చిక్కుకున్నారు.

* సినీ నటుడు చిరంజీవి వాహన శ్రేణిని పోలీసులు మార్కెట్‌ కమిటీ చెక్‌పోస్టు వద్ద అడ్డుకున్నారు. వాహనంలో మెగాస్టార్‌ ఉన్న విషయం తెలుసుకుని ఆ ఒక్క వాహనాన్ని వేదిక వద్దకు అనుమతించారు.

* సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సభా ప్రాంగణం చాలకపోవడం.. ఇటీవల కురిసిన వర్షానికి బురదమయం కావడంతో అవస్థలు పడుతూ కొందరు ప్రసంగం వినాల్సి వచ్చింది. పోలీసుల ఆంక్షల వల్ల మరికొందరు వెనుదిరగాల్సి వచ్చింది.

ప్రధానికి కేటాయించిన కుర్చీలో జగన్‌..

ప్రధాని కంటే ముందే గవర్నర్‌తో కలిసి వేదికపైకి చేరుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ తొలుత గవర్నర్‌ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు. అది ప్రధానమంత్రికి కేటాయించిన స్థానం అని సిబ్బంది వచ్చి చెప్పటంతో వెంటనే ఆయన తనకు కేటాయించిన కుర్చీలో ఆసీనులయ్యారు.

ఇవీ చదవండి:

'నేను పవర్‌ఫుల్‌ ఉమన్‌..అందుకే పవర్‌లిఫ్టింగ్‌ ఎంచుకున్నా..'

'రబ్బర్​ స్టాంపుగా మారనని ప్రమాణం చేయండి​'.. ముర్ముకు సిన్హా సవాల్​

ABOUT THE AUTHOR

...view details