Birth Day Wishes to CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేస్తూ.. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరెప్పుడూ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. అంతేగాక, స్వయంగా ప్రధాని మోదీ కేసీఆర్‌కు ఫోన్ చేసిన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖుల శుభాకాంక్షలు..
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బోకేను పంపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. సీఎంకు బర్త్‌డే విషెస్ చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ.. కేసీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
డాడ్.. యూ ఆర్ మై హీరో..
KTR Birth Day Wishes to KCR : సీఎం కేసీఆర్‌కు ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ భావోద్వేగకరంగా పుట్టిన రోజు విషెస్ చెప్పారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే అలవాటుగా కేసీఆర్ మార్చుకున్నారని కేటీఆర్ కొనియాడారు. దయతో నిండిన హృదయంతో అందర్ని ముందుకు నడిపిస్తారని అన్నారు. కేసీఆర్‌కు.. సవాళ్లను ధైర్యం ఎదుర్కొనే సత్తా ఉందని తెలిపారు. ''నా నాయకుడు.. నా తండ్రి.. అని'' గర్వంగా పిలుచుకుంటానని ట్విటర్ వేదికగా కేటీఆర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
మనుమడి శుభాకాంక్షలు..
కేసీఆర్ జన్మదినం సందర్భంగా... ఆయన మనమడు హిమాన్షు శుభాకాంక్షలు తెలిపారు. తాత కేసీఆర్ కాళ్లకు దండం పెట్టారు. దేశానికి కేసీఆర్ ఆదర్శవంతమైన నాయకుడని... ప్రజలకు సేవ చేయాలనే నిరంతర తపనతో పాటు అంకితభావం గల నేత తన తాత కేసీఆర్ అని పేర్కొన్నారు. ఈ మేరకు హిమాన్షు ట్విట్ చేశారు.
కేసీఆర్ పుట్టినరోజు.. తెలంగాణకు పండుగరోజు..
సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర వైద్యఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ పుట్టినరోజు తెలంగాణకు పండుగరోజని అన్నారు. దశాబ్దాల తెలంగాణ కల కేసీఆర్ వల్లే సాకారమైందని తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణ తలరాత మారిందిని చెప్పారు. సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలని 5 కోట్ల ప్రజానీకం ఆకాంక్షిస్తోందని హరీశ్ రావు ట్వీట్ చేశారు.