తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇంటింటికి పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్.. శరవేగంగా పనులు

హైదరాబాద్​ మహానగరంలో త్వరలో పుష్కలంగా పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌(పీఎన్‌జీ) అందుబాటులోకి రానుంది. ప్రతి ఇంటికి అందించే లక్ష్యంతో పైపులైన్ల ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం చాలా తక్కువ ప్రాంతాలకు మాత్రమే ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 35 స్టేషన్ల ద్వారా ఆటోలు, బస్సులు, క్యాబ్‌లకు కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌(సీఎన్‌జీ) అందుతోంది. మున్ముందు మరిన్ని ప్రాంతాల్లోని ఇళ్లతోపాటు వాహనాలకు ఈ గ్యాస్‌ను సరఫరా చేసేందుకు భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌(బీజీఎల్‌) ప్రణాళిక సిద్ధం చేసింది. పలు చోట్ల పైపులైన్లు ఏర్పాటవుతున్నాయి.

By

Published : Jan 31, 2021, 10:55 AM IST

Plenty of Piped Natural Gas (PNG) will soon be available in the Hyderabad people
ఇంటింటికి పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్.. శరవేగంగా పనులు

గ్రేటర్ హైదరాబాద్​‌ పరిధిలో ఇంటింటికి పీఎన్‌జీ సరఫరా చేసేందుకు గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌ సంయుక్త వెంచర్‌తో.. బీజీఎల్‌ పైపులైను ఏర్పాటు పనులు చేపట్టింది. ప్రస్తుతం శామీర్‌పేట మదర్‌స్టేషన్‌ నుంచి కొన్ని ఇళ్లకు పైపు ద్వారా గ్యాస్‌ను అందజేస్తున్నారు. ఈ ఏడాది మరిన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించాలనేది ప్రణాళిక. భవిష్యత్తులో నగరవ్యాప్తంగా ఇవ్వాలనుకుంటున్నారు. కొత్త ప్రాంతాల్లో 70 కి.మీ. మేర.. స్టీల్‌ పైప్‌లైన్‌, మరో 500 కి.మీ. వరకు మీడియం డెన్సిటీ పాలీ ఇథలీన్‌(ఎండీపీఈ) పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రయోగాత్మక సరఫరా ఇస్తున్న ప్రాంతాలు..

మేడ్చల్‌, కొంపల్లి, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, బాలానగర్‌, మూసాపేట, కూకట్‌పల్లిలోని కొన్ని ఇళ్లకు.

కూకట్‌పల్లి నుంచి ఆరాంఘర్‌ మధ్య..

ప్రస్తుతం పైపులైన్‌ ఏర్పాటు పనులు కూకట్‌పల్లి, ఆరాంఘర్‌ మధ్య గచ్చిబౌలి, హఫీజ్‌పేట, మెహిదీపట్నం, నానల్‌నగర్‌, అత్తాపూర్‌ వద్ద వేగంగా జరుగుతున్నాయి. ఈసీఎల్‌ క్రాస్‌ రోడ్స్‌ నుంచి వయా బోయిన్‌పల్లి, తిరుమలగిరి, సైనిక్‌పురి, ఎస్‌ఎస్‌రావునగర్‌ను కలుపుకొంటూ మరో పైపులైన్‌ పనులు చేపట్టనున్నారు. పనులు పూర్తయ్యాక పీఎన్‌జీ సరఫరా చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలో ఉన్న 35 సీఎన్‌జీ స్టేషన్లకు శామీర్‌పేటలోని మదర్‌స్టేషన్‌ నుంచి వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారు. అప్పుడప్పుడు వాహనాలు ఆలస్యం కావడం వల్ల ఆయా స్టేషన్ల వద్ద వాహనదారులు పడిగాపులు పడాల్సి వస్తోంది. పైపులైన్ల విస్తరణ పూర్తయితే ఆయా స్టేషన్లనూ అనుసంధానించడంతోపాటు కొత్తగా మరో 30 నేచురల్‌ గ్యాస్‌ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురానున్నారు.

  • గృహ, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక అవసరాలకు, వాహనాలకు 24 గంటలు కావాల్సినంత పీఎన్‌జీ సరఫరా.
  • 98 శాతం శుద్ధి చేసిన అత్యంత సురక్షితమైన గ్యాస్‌ అందజేత.
  • లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌(ఎల్‌పీజీ)తో పోల్చితే పూర్తిగా సురక్షితం. ధర దాదాపు 30-40 శాతం తక్కువ.
  • గ్యాస్‌ లీకైనా మంటలు రావు. వెంటనే గాల్లో కలిసిపోతుంది.
  • లిండర్ల కోసం నిరీక్షించాల్సిన పని ఉండదు.
  • పర్యావరణ పరంగా ఎలాంటి కర్బన ఉద్గారాలు గాల్లోకి వెలువడవు.

ఇవీ చూడండి:పిల్లల్ని ఎత్తుకెళ్లే రాబందులు

ABOUT THE AUTHOR

...view details