బియ్యం పంపిణీ చేశారు. వాటిని తీసుకున్న లబ్ధిదారులు వంట చేసుకోవడానికి సిద్ధమయ్యారు. బియ్యాన్ని శుభ్రం చేసి వండుకుని తిందామని చూస్తే బియ్యం సాగుతున్నాయి. అనుమానం వచ్చి కొన్ని బియ్యం గింజలను నీటిలో వేయగా తేలుతున్నాయి. మరికొన్నింటిని నిప్పులో వేయగా ప్లాస్టిక్ వాసన వచ్చింది. తమకు ప్లాస్టిక్ బియ్యం పంపిణీ చేశారంటూ లబ్ధిదారులు ఆందోళన చేపట్టిన ఘటన ఏపీలోని ఎం.మాకవరంలో చోటుచేసుకుంది.
ఏపీ విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలోని ఎం.మాకవరం జీసీసీ డిపో నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండటంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండటాన్ని వారు గుర్తించారు. పంపిణీ అనంతరం ఇంటికి తీసుకెళ్లి వండుకోవడానికి సిద్ధమవుతున్న క్రమంలో ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించామని స్థానికులు చెబుతున్నారు. ఇవి విరవడానికి ప్రయత్నిస్తే విరగలేదని, నీటిలో నాన బెడితే సాగుతున్నాయని పలువురు ఆరోపించారు.