తెలంగాణ

telangana

ETV Bharat / city

‘ప్లాస్మా సేకరణకు మొబైల్​ యూనిట్లు ఏర్పాటు చేయాలి’ - రక్తదానం

కొవిడ్‌ వైరస్ చికిత్సకు అవసరమయ్యే.. ప్లాస్మా సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం మొబైల్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్లాస్మా దాతల సంఘం అధ్యక్షుడు గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్‌ చేశారు. కొవిడ్‌తో తీవ్ర అనారోగ్యం పాలైన వందలాది మంది రోగుల ప్రాణాలు కాపాడేందుకు సంజీవని లాంటి ప్లాస్మా థెరపీని విరివిగా వినియోగించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

Plasma donor narayanareddy demands for mobile plasma centers in state
‘ప్లాస్మా సేకరణకు.. మొబైల్​ యూనిట్లు ఏర్పాటు చేయాలి’

By

Published : Jul 23, 2020, 10:48 PM IST

కరోనాతో బాధపడుతున్న వారికి తక్షణ చికిత్స కోసం విరివిగా ప్లాస్మా సేకరించాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా తీవ్రతను ఎదుర్కోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం మొబైల్​ ప్లాస్మా యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్లాస్మా దాతల సంఘం అధ్యక్షుడు గూడూరు నారాయణ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37, 666 మంది కొవిడ్ నుంచి కోలుకోగా... మరో 11,155 మంది చికిత్స పొందుతున్నారని.. వారిలో వందలాది మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని.. ప్లాస్మాథెరపీ ద్వారా వారి ప్రాణాలు నిలిచే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయడానికి అంగీకరించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.

చాలా మంది ప్లాస్మా దానం చేసేందుకు చొరవ చూపుతున్నప్పటికీ... ఆస్పత్రులకు వచ్చేందుకు వెనకాడుతున్నారన్నారు. ఆస్పత్రులకు వస్తే.. మళ్లీ కరోనా వస్తుందని.. ఇతర అంటు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని భయపడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి అపోహలు తొలిగించేందుకు ప్లాస్మా దానం పూర్తిగా సురక్షితమని, ఇదొక గొప్ప అవకాశమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మొబైల్‌ ప్లాస్మా యూనిట్లు ఏర్పాటు చేస్తే ప్లాస్మా దాతలు ఉత్సాహంగా ముందుకొస్తారన్నారు. కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీ సమర్థవంతమైనదిగా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కరోనాతో బాధపడుతున్న రోగులకు... కోలుకున్న రోగుల నుంచి సేకరించిన ప్లాస్మాను ఉపయోగించడాన్ని అమెరికా ఎఫ్‌డీఏ కూడా ఆమోదించిందని వివరించారు.

1918లో ఫ్లూ, పోలియో, మీజిల్స్, గవదబిళ్ళలు లాంటి వ్యాధుల చికిత్సకు సైతం ప్లాస్మా థెరపీనే అనుసరించారని ఆయన గుర్తు చేశారు. ఐసీఎంఆర్ దేశంలోని 52 సంస్థల ద్వారా నిర్వహించిన ప్లాస్మా థెరపీ ప్రయోగాలు ఆశించిన ఫలితాలు వచ్చాయని తెలిపారు. కరోనా రోగులకు ఇచ్చే ఫ్లాస్మా తాజాగా ఉండాలని, అది కూడా సేకరించిన అయిదు నుంచి పది రోజులు లోపలే వాడాలని పరిశోధకులు సూచిస్తున్నట్లు వివరించారు. ప్లాస్మా సేకరణ మొబైల్‌ యూనిట్లు లేకపోవడంతో అర్హులైన దాతలను గుర్తించడం, సేకరించడం ఇబ్బందిగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి ప్లాస్మా థెరపీని విస్తృతపరచి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణం పోయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details