తెలంగాణ

telangana

ETV Bharat / city

Pil on Ttd: తితిదే నూతన పాలకమండలిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం - తితిదే నూతన పాలకమండలి తాజా వార్తలు

కల్యాణదుర్గానికి చెందిన తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు (Pil on Ttd) చేశారు. తితిదే నూతన పాలకమండలిపై ఆయన పిటిషన్ వేశారు.

Pil on Ttd
తితిదే

By

Published : Sep 20, 2021, 4:11 PM IST

తితిదే నూతన పాలకమండలిపై కల్యాణదుర్గానికి చెందిన తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు (Pil on Ttd) చేశారు. ఎండోమెంట్‌ యాక్టు 1987కు విరుద్ధంగా బోర్డు నియామకం జరిగిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. జంబో బోర్డుతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పవని అన్నారు.

జంబో పాలక మండలి..

తితిదే పాలకమండలి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడు జీవోలు జారీ చేసింది. ఛైర్మన్‌గా రెండోసారి వైవీ సుబ్బారెడ్డిని ఇప్పటికే నియమించారు. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నలుగురు అధికారులతో పాటు 24 మందిని సభ్యులుగా నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌కు అవకాశం కల్పించారు. వీరికి బోర్డులో ఓటింగ్‌ హక్కు లేనప్పటికీ, సభ్యుల్లాగే ప్రొటోకాల్‌ ఉంటుందని పేర్కొన్నారు. వీరికి తోడు గతంలో ఎప్పుడూ లేనంతగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.

వీరిలో ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ధార్మిక సంస్థల సభ్యులు తదితరులు ఉన్నారు. చైర్మన్‌ సహా సభ్యుల పదవీ కాలం దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్‌ 99ను అనుసరించి ఉంటుందని పేర్కొన్నారు. తితిదే పాలక మండలి సభ్యుల పదవీ కాలం కొనసాగినంత కాలం ఆలయ ప్రత్యేక ఆహ్వానితుల పదవీ ఉంటుందని..పాలక మండలి సభ్యులకు వర్తించే ప్రొటోకాల్‌ వీరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. పాలకమండలిలో పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధుల బంధువులు, రాజకీయ సిఫార్సులతో అవకాశం దక్కించుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అధికార వైకాపా బాధ్యతలు చూస్తున్న వారితోపాటు కొందరు నేర అభియోగాలున్న వారికీ ఈ జంబో పాలకమండలిలో చోటు దక్కిందనే ప్రచారం లేకపోలేదు.

తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల వారిని సభ్యులుగా, ఆహ్వానితులుగా నియమించారు. పాలక మండలి సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 10 మంది, తెలంగాణ నుంచి ఏడుగురు, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర నుంచి ఇద్దరేసి, గుజరాత్‌, పశ్చిమబంగాల్‌, పుదుచ్చేరి నుంచి ఒక్కకొక్కరికి అవకాశం దక్కింది. పాలకమండలి కూర్పు, భారీగా ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై ధార్మిక వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.

భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో వారికి మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ఎక్కువ మందికి అవకాశం కల్పించడం సబబేనని ప్రత్యేక ఆహ్వానితులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నియామకాలు అపహాస్యపు విధానాలుగా కనిపిస్తున్నాయని.. దీని వల్ల తితిదే వ్యవస్థ హాస్యాస్పదం అవుతుందని విశ్రాంత ఈవోలు పెదవి విరుస్తున్నారు. సభ్యుల సంఖ్య పెరిగితే ఆ భారం తితిదేపైనే పడుతుందని ధార్మిక సంస్థ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. రాజకీయ వ్యవస్థల జోక్యం నుంచి ధార్మిక సంస్థలు పూర్తిగా బయటకు రావాలని స్వామి కమలానంద భారతి ఆకాంక్షించారు. తిరుమల ప్రతిష్ట, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆరోపిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి జగన్​కు లేఖ రాశారు.

ABOUT THE AUTHOR

...view details