తెలంగాణ

telangana

ETV Bharat / city

పండుగలను న్యాయస్థానాలు నిషేధించలేవు: హైకోర్టు - high court hearing corona case

high court on corona
high court on corona

By

Published : Mar 4, 2020, 5:33 PM IST

Updated : Mar 4, 2020, 7:13 PM IST

17:32 March 04

పండుగలను న్యాయస్థానాలు నిషేధించలేవు: హైకోర్టు

 కరోనా వ్యాప్తి నిరోధించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కరోనాపై రేపు సమగ్ర ప్రణాళికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున రాష్ట్రంలో హోళీ నియంత్రించాలని కోరుతూ గచ్చిబౌలికి చెందిన సిద్ధలక్ష్మి అనే మహిళ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని లంచ్ మోషన్​గా దాఖలు చేశారు. పిల్​ను అత్యవసర వ్యాజ్యంగా పరిగణించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.  

వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టండి

పండుగలను న్యాయస్థానాలు నిషేధించలేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మురికి వాడలు, పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంది. సభలు, సమావేశాల అనుమతులపై పోలీసులు సమీక్షించాలని ఆదేశించింది. జైళ్లలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఖైదీలను ప్రత్యేక బ్యారక్​లో ఉంచే అవకాశాలను పరిశీలించాలని డీజీపీకి సూచించింది.  

తప్పనిసరైతేనే..

విచారణ ఖైదీలను జైలు సిబ్బంది కోర్టుల్లో హాజరు పరచలేకపోతే.. వారిని శిక్షించవద్దని మెజిస్ట్రేట్లకు హైకోర్టు స్పష్టం చేసింది. రేపటి నుంచి హైకోర్టుకు వచ్చే వారికి మాస్కులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించింది. తప్పనిసరైతే మినహా కోర్టుకు రావద్దని కక్షిదారులకు చెప్పాలని న్యాయవాదులకు సూచించింది. కరోనాను ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి రేపు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేసు విచారణకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డిని అమికస్ క్యూరీగా నియమించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 

Last Updated : Mar 4, 2020, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details