ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై వాదనలు ముగిసాయి. సమ్మె విరమించేలా ఆర్టీసీ సంఘాలను ఆదేశించాలని ఓయూ రీసెర్చ్ స్కాలర్ సురేంద్రసింగ్ దాఖలు చేసిన పిల్‌పై న్యాయస్థానం విచారించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు వెల్లడించింది. రెండు గుర్తింపు సంఘాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
వెంటనే సమ్మె ఆపాలి: పిటిషనర్ తరఫు న్యాయవాది
సమ్మెతో ప్రజలు పడుతున్న ఇక్కట్లు కోర్టు దృష్టికి తెచ్చామని పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య తెలిపారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం కమిటీ వేయాలని కోరామని వెల్లడించారు. నివేదిక ఆధారంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని... వెంటనే సమ్మె ఆపేలా చూడాలని కోర్టుకు నివేదించామని పేర్కొన్నారు.