స్థిరాస్తి వ్యాపారం చేసే ఆంధ్రప్రదేశ్లోని నిమ్మగడ్డ చైతన్య విజయవాడలోని పటమటలో నివాసం ఉంటున్నారు. బెంజిసర్కిల్ సమీపంలోని తన బంధువుకు చెందిన భవనం చూసేందుకు వెళ్లారు. అక్కడ ఆకాశంలో గుంపులుగా తిరుగుతున్న అడవి పావురాలను చూశారు. వాటికి ఆహారంగా జొన్నలను డాబాపై చల్లారు. గింజలను తింటున్న పావురాలను చూసి ఆనందం కలగడం వల్ల ప్రతిరోజూ గింజలు వేయడం ప్రారంభించారు.
మొదట 30 పావురాలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య వందకు చేరింది. మధ్యాహ్నం అయితే చాలు పావురాలు అక్కడికి చేరుకొని చైతన్య కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రతి నెల 60 నుంచి 70 కిలోల జొన్నలు పావురాలకు ఆహారంగా వేస్తున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒకటిన్నర వరకు వాటికి భోజన సమయం. ఆ సమయంలో మాత్రమే పావురాలు అక్కడికి వస్తుంటాయి.