తెలంగాణ

telangana

ETV Bharat / city

షార్‌లో మరో భారీ ప్రాజెక్టు పూర్తి... వచ్చే నెలలో ప్రారంభం! - షార్ తాజా సమాచారం

Sriharikota News: ఏపీలోని షార్‌లో పీఐఎఫ్‌ ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయి. వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇక్కడి నుంచి ఏటా 15 పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) ప్రయోగాలు చేపట్టేలా ఇస్రో ప్రణాళికలు రచించింది.

Sriharikota
Sriharikota

By

Published : May 9, 2022, 9:27 AM IST

Sriharikota News: ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో (షార్‌) మరో భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. దీనిని వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఏడాదిన్నర కిందటే సిద్ధం కావాల్సి ఉండగా.. కొవిడ్‌ విజృంభణతో పనుల్లో జాప్యం జరిగింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇక్కడి నుంచి ఏటా 15 పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) ప్రయోగాలు చేపట్టేలా ఇస్రో ప్రణాళికలు రచించింది. ఇందుకుగానూ కొత్త ప్రయోగ వేదిక నిర్మాణం చేపట్టకుండా ఉన్న దాంట్లోనే మరిన్ని వసతులు ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చేలా రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో మొదటి ప్రయోగ వేదికను పూర్తి స్థాయిలో ఆధునికీకరించాలని 2018లో భావించారు. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో రూ.471 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పీఐఎఫ్‌ (పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటీ) పనులు 2019లో ప్రారంభించారు. కొవిడ్‌ సవాళ్లను అధిగమించి ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు రేయింబవళ్లు శ్రమించి ప్రాజెక్టు పూర్తి చేశారు.

నిర్మాణం ఇలా..షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానం చేస్తూ పీఐఎఫ్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొదటి ప్రయోగ వేదికలో వసతులు ఏర్పాటయ్యాయి. ‘ఇంటిగ్రేషన్‌ ఆన్‌ప్యాడ్‌, ఇంటిగ్రేషన్‌ ట్రాన్స్‌ఫర్‌ టు ప్యాడ్‌’ అనే రెండు అంశాలను మొదటి ప్రయోగ వేదికకు జోడించి పనులు చేశారు. పీఐఎఫ్‌లో వాహక నౌకను అనుసంధానం చేసి, పూర్తి సాంకేతిక పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రయోగ వేదిక వద్దకు తెస్తారు. మొబైల్‌ సర్వీస్‌ టవర్‌ను (ఎంఎస్‌టీ) ప్రయోగ వేదికకు తరలించి ఉపగ్రహాన్ని వాహక నౌకకు అనుసంధానం చేస్తారు. ఉష్ణ కవచాన్ని వాహక నౌకను అనుసంధానం చేసిన అనంతరం ఎంఎస్‌టీని ప్రయోగ వేదిక నుంచి 200 మీటర్ల దూరం తీసుకెళ్తారు. ప్రయోగ వేదికపై వాహక నౌక ఉన్న సమయంలో వాతావరణంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఇబ్బంది లేకుండా ఎంఎస్‌టీ సేవలు వినియోగించే వెసులుబాటు ఉంటుంది.
ప్రత్యేక వివరాలు
* పీఐఎఫ్‌ భవనం ఎత్తు 15 అంతస్తులుగా ఉంటుంది. దాని ఎత్తు 66 మీటర్లు, వెడల్పు 35 మీటర్లు, పొడవు 35 మీటర్లు.
* రాకెట్‌ అనుసంధానం కోసం పది స్థిర ప్లాట్‌ఫారాల ఏర్పాటు.
* భవనం నుంచి ప్రయోగ వేదిక వరకు 1.5 కి.మీ ట్రాక్‌

ఇదీ చదవండి:Hyderabad Metro Losses: మెట్రోను వదలని నష్టాలు... ఆగినా.. నడిపినా అవే కష్టాలు!

ABOUT THE AUTHOR

...view details