తెలంగాణ

telangana

ETV Bharat / city

పంట భూముల్లో పేరుకుపోయిన భాస్వరం... డీఏపీ వాడకమే కారణం - telangana crop lands

తెలంగాణ పంటభూముల్లో భాస్వరం పేరుకుపోతోంది. ఏ స్థాయిలో అంటే.. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంతగా పదకొండు జిల్లాల్లో అత్యధిక స్థాయిలో నిల్వ చేరింది. ప్రతి రెండేళ్లకోసారి మట్టి నమూనాలను వ్యవసాయాధికారులు సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షిస్తున్నారు. వాటి ఫలితాల ప్రకారం దేశవ్యాప్తంగా ఏ జిల్లా పంట భూముల్లో భాస్వరం ఏ మోతాదులో ఉందనే వివరాలను రంగుల్లో చూపుతూ కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా పటాలను విడుదల చేయడంతో ఈ విషయం తేటతెల్లమైంది.

Phosphorus accumulated in crop lands in telangana
Phosphorus accumulated in crop lands in telangana

By

Published : Apr 10, 2021, 8:11 AM IST

2017-18, 2018-19 ఏడాదుల్లో చేసిన పరీక్షల ప్రకారం అత్యధికంగా తెలంగాణలోనే 11 జిల్లాల పరిధిలో 207 మండలాల నేలల్లో భాస్వరం పరిమితికి మించి ఉంది. మరే రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లా, ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌ జిల్లా పరిధి నేలల్లో మాత్రమే తెలంగాణలో స్థాయిలో భాస్వరం ఉంది. మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా జిల్లాల భూముల్లో మోతాదుకన్నా తక్కువగా ఉంది. అక్కడి రైతులు ‘డై అమ్మోనియం ఫాస్ఫేట్‌’(డీఏపీ), కాంప్లెక్స్‌ ఎరువులను పెద్దగా వాడకపోవడం వల్లనే ఆ పరిస్థితి ఉందని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు. ‘తెలంగాణలో పత్తి, మిరప, పసుపు, వరి వంటి పంటల సాగులో రసాయన ఎరువులను అవసరానికి మించి కుమ్మరిస్తున్నారు. నేలలో భాస్వరం నిల్వలు పెరిగిపోవడానికి అదే కారణం. ఉదాహరణకు ఆయా పంటలు అధికంగా సాగయ్యే కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని మండలాల భూముల్లో భాస్వరం ఎక్కువ ఉంది. పెద్దపల్లి జిల్లాలో 11,345 మట్టి నమూనాలను పరీక్షిస్తే 7,119 నమూనాల్లో చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది’ అని జయశంకర్‌ వర్సిటీ వర్గాలు తెలిపాయి.

‘‘భాస్వరం ఎక్కువగా ఉన్న నేలల్లో ‘ఫాస్ఫరస్‌ సాల్యుబుల్‌ బ్యాక్టీరియా’(పీఎస్‌బీ) అనే జీవన ఎరువును ఎకరానికి రెండు కిలోలు వాడితే, అది భాస్వరాన్ని కరిగించి మొక్కకు వెళ్లేలా చేస్తుంది. ఖరీఫ్‌ పంట కాలంలో ఆయా జిల్లాలోని రైతులందరికీ పీఎస్‌బీ ఇవ్వడంతోపాటు, వాడేలా రైతులకు అవగాహన కల్పించాలని జయశంకర్‌ వర్సిటీ తాజాగా నిర్ణయించింది. దీనివల్ల డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల కొనుగోలు భారమూ తగ్గుతుంది’ అని వర్సిటీ అధికారులు వెల్లడించారు.

లాభం కన్నా నష్టమే ఎక్కువ

"సాధారణంగా పంట సాగు ప్రారంభించే సమయంలో మట్టి నమూనాను పరీక్షించి భాస్వరం తక్కువగా ఉంటే డీఏపీ ఎరువును ఎకరానికి 60 కిలోలు, ఎక్కువగా ఉంటే 30 కిలోలు వాడితే సరిపోతుంది. అందుకు భిన్నంగా ఇక్కడి రైతులు పంట సాగుకు ముందు డీఏపీ వేసి, మొక్కలు పెరిగే సమయంలో కోత దశ వరకూ కాంప్లెక్స్‌ ఎరువులు విరివిగా వాడుతున్నారు. కాంప్లెక్స్‌ ఎరువు బస్తాలోనూ భాస్వరం ఉండటంతో అది నేలలో పేరుకుపోతోంది. దానివల్ల ఇతర సూక్ష్మపోషకాలు మొక్కకు సరిగా అందక పూత, కాత సరిగా రాక దిగుబడి పెరగడం లేదు. దీనివల్ల పర్యావరణానికీ ముప్పే." - డాక్టర్‌ జగదీశ్వర్‌, డైరక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌, జయశంకర్‌ వర్సిటీ

ఇదీ చూడండి: కొవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం- నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details