కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పట్టభద్రులు పొలంబాట పట్టారు. సొంత వ్యవసాయ భూమిలో కూలీల ఖర్చుకు బదులు కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకుని అరక చేతపట్టి పంటలు పండిస్తున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్.. వ్యవసాయంలో నిమగ్నం
కె.శంకర్‌ది ఆదిలాబాద్ జిల్లా ఆశపల్లికి చెందిన నందునాయక్ తండా. గ్రామచుట్టు పక్కల ప్రాంతాల్లో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థి ఇతనొక్కరే. 2017లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తుండగా.. గతేడాది నుంచి మరాఠీ విభాగంలో పార్ట్‌టైమ్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. మార్చిలో లాక్‌డౌన్ వచ్చాక సొంతూరుకు వెళ్లిపోయారు. ఏప్రిల్, మే నెలలో పలుమార్లు ఆన్‌లైన్ తరగతులు బోధించారు. దానికి సంబంధించి జీతాలు ఇంకా అందలేదు.
కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ముల్లో శంకర్ పెద్దవాడు కావడంతో కుటుంబ బాధ్యత అతనిపైనే పడింది. తనకు ఉన్న నాలుగెకరాల భూమిలో గత నెలలో పత్తి, పెసర, జొన్న పంటలు వేశారు. ‘‘ప్రస్తుతం వర్సిటీ తిరిగి ఎప్పటికీ ప్రారంభమవుతుందో తెలియదు. నాకు వ్యవసాయంపై పెద్దగా అవగాహన లేదు. అయినప్పటికీ ఇంటి బాధ్యతలు నాపైనే ఉన్నాయి. వ్యవసాయం చేస్తే ఎంతో కొంత కుటుంబానికి ఆసరాగా ఉండవచ్చని ఈ పనులు చేస్తున్నా’’ అని శంకర్ వివరించారు.
పుస్తకాలతో కుస్తీ పడుతూనే పంట సాగు
కామారెడ్డి జిల్లా మద్నూరుకు చెందిన ఎల్.క్రాంతిరాజ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హిందీ సాహిత్యంపై పీహెచ్‌డీ చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో అతను సొంతూరుకు వెళ్లారు. క్రాంతి కుటుంబానికి రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండు నెలలుగా ఇంటి వద్దనే ఉంటూ పీహెచ్‌డీ పుస్తకాలపై కుస్తీ పట్టారు. గత నెలలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పొలంలో మినుములు, పెసర్లు వేసి సాగు చేస్తున్నారు. తండ్రితోపాటు పంటలు పండిస్తూ కలుపు తీస్తున్నారు. ‘‘యూనివర్సిటీలో ఉన్నప్పుడు అంతా సవ్యంగా సాగిపోయేది. ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో తెలిసేది కాదు. ఇప్పుడు మూడు నెలలుగా ఇంటి వద్దనే ఉండటంతో కుటుంబ స్థితిగతులు, వ్యవసాయంలో కష్టాలు తెలిశాయి. అందుకే కూలీలకు అయ్యే ఖర్చు తగ్గించుకోవాలని పొలం పనుల్లో పాల్గొంటున్నా’’ అని క్రాంతిరాజ్ తెలిపారు.