సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. అయితే దేశంలో ఇటీవల పెరుగుతున్న పెట్రోలియం ధరలు అందుకు భిన్నంగా సాగుతున్నాయి. ప్రపంచ విపణిలో బ్యారెల్ ముడిచమురు ధరలతో సంబంధం లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.... వాహనదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో 159 లీటర్ల సామర్థ్యం కలిగిన బ్యారెల్ ముడి చమురు ధర రూ.4వేల 784 ఉండగా.. లీటరు ముడి చమురు ధర రూ.30.08పైసలుగా ఉంది. అయితే మే ఆరో తేదీ నాటికి బ్యారెల్ ముడి చమురు ధర ఎకాఎకిన రూ.2,061కు పడిపోయింది. దీంతో ముడిచమురు లీటరు ధర ఒక్కసారిగా రూ.12.96పైసలకు తగ్గిపోయింది. ఆదివారం మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర రూ.2,745 ఉండగా.... ముడి చమురు లీటరు ధర రూ.17.26గా ఉంది.
వాహనదారులకు చుక్కలు
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. పెట్రోల్ ధర రూ. 78.67కాగా, డీజిల్ ధర రూ.71.82గా ఉంది. నగరంలో అమలవుతున్న లీటరు పెట్రోల్, డీజిల్ ధరల ఆధారంగా ముడి చమురు శుద్ధి చేయడం, రవాణా, పెట్రోల్ బంకు యజమానులకు.. డీజిల్ లీటరుకు రూ.2.52 పైసలు, పెట్రోల్‌కు రూ.3.56 పైసలు కమిషన్ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.32, డీజిల్‌పై రూ.31.83 పైసల ప్రకారం ఎక్సైజ్ సుంకం విధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 35.20శాతం, డీజిల్‌పై 27శాతం విలువ ఆధారిత పన్నులు వేస్తోంది. ఇలా పలురకాల పన్నులు, సుంకాలు అన్నీ కలిపితే పెట్రోల్‌పై రూ.61.41 పైసలు, డీజిల్‌పై రూ.54.56 పైసలు.. ముడి చమురు లీటరు ధరలకు అదనంగా వసూలు చేస్తున్నారు.