కొవిడ్ సమయంలో అమలైన లాక్ డౌన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు స్తంభించాయి. అత్యవసర వాహనాలు మినహాయిస్తే దాదాపు అన్ని వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఆ తర్వాత క్రమంగా లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ వస్తుండడంతో వాహనాలు క్రమంగా రోడ్డు పైకి రావడంతో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి.
అమ్మకాల్లో వృద్ధి
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి నెలలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు పెరిగాయి. పెట్రోల్ 7.3 శాతం, డీజిల్ 5.4 శాతం లెక్కన అమ్మకాల్లో వృద్ధి నమోదు చేశాయి. 2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి వరకు జరిగిన అమ్మకాలు 13.95 లక్షల కిలోలీటర్లు పెట్రోల్ కాగా 2020 ఏప్రిల్ నుంచి 2021 జనవరి వరకు 12.52 లక్షల కిలో లీటర్ల అమ్మకాలు జరిగినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. 2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి వరకు 26.97 లక్షల కిలోలీటర్లు డీజిల్ అమ్మకాలు జరగ్గా... 2020 ఏప్రిల్ నుంచి 2021 వరకు 23.73 లక్షల కిలో లీటర్లు అమ్ముడుపోయినట్లు చమురు సంస్థలు తెలిపాయి.