చమురు ధరలు రోజురోజుకూ దడ పుట్టిస్తున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో మళ్లీ ప్రారంభమైన వడ్డింపునకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మంటలూ తోడయ్యాయి. తొలుత బల్క్ ధరలను పెంచిన చమురు సంస్థలు.. ఆ తర్వాత సాధారణ వినియోగదారులపైనా వరుసగా రోజుకింత భారం మోపుతూ వస్తున్నాయి. తాజాగా బుధవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 0.91 పైసలు, డీజిల్‌పై 0.87 పైసలను వడ్డించాయి. గత ఏడాది నవంబరు తర్వాత లీటరు డీజిల్ ధర రూ.వందను అధిగమించటం ఇదే. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం, హైదరాబాద్ నగరంలో బుధవారం డీజిల్ రూ.వందను దాటింది. గడిచిన తొమ్మిది రోజుల్లో ఒక్క రోజు మినహా మిగిలిన అన్ని రోజులూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
రికార్డు ధరలకు పరుగులు:పెట్రోలు, డీజిల్ ధరలు మునుపటి రికార్డులను అధిగమించేందుకు పరుగులు తీసుకున్నాయి. గడిచిన రెండున్నర దశాబ్దాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు వంద రూపాయల మార్కును అధిగమించటం ఇదే రెండో దఫా. గత ఏడాది నవంబరు రెండో తేదీన డీజిల్ లీటరు ధర రూ.107.37 పలికింది. 1995 తరవాత అదే అత్యధిక ధర. తాజాగా మళ్లీ రూ. 100.71కి చేరుకుంది. పెట్రోలు గత ఏడాది నవంబరులో అత్యధికంగా రూ.118.04 వరకు వెళ్లింది. తాజాగా పెట్రోలు ధర రూ.114.52కు చేరుకుంది. త్వరలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుదలలో కొత్త రికార్డులు నమోదవుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఉపశమనం ఉండేనా..:రష్యా, ఉక్రెయిన్ మధ్య రాజీకి అడుగులు పడుతున్న తరుణంలో అంతర్జాతీయ విపణిలో చమురు ధరల్లో ఏమైనా ఉపశమనం లభిస్తుందా.. అన్నది చర్చనీయాంశంగామారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర బుధవారం స్వల్పంగా పెరిగి 112 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఉద్రిక్తతలు తగ్గితే ముడి చమురు ధరలు తగ్గే అవకాశాలుంటాయని వ్యాపారవర్గాల అభిప్రాయం. అయితే, ఆ తగ్గింపు వినియోగదారులకు అందించేందుకు చమురు సంస్థలు ఏ మేర ముందుకు వస్తాయన్నది ప్రశ్నార్థకమేనని డీలర్లు చెబుతున్నారు.
టోల్‌ఛార్జీల మోతా మొదలవుతోంది. గురువారం అర్ధరాత్రి నుంచి పెంచిన టోల్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. వాహనం స్థాయిని బట్టి కనిష్ఠంగా రూ.పది, గరిష్ఠంగా రూ.90 పెరిగింది. టోల్‌ప్లాజా పరిధిలోని స్థానికులకు ఇచ్చే నెలవారీ సీజన్ టికెట్ ధర రూ.30 వరకు పెరిగింది. ఇతర వాహనాలకు ఇచ్చే నెలవారీ సీజన్ టికెట్ ధరను కూడా జాతీయ రహదారుల సంస్థ పెంచింది. ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్‌ఛార్జీలను ఆ సంస్థ పెంచుతుంది. ప్లాజాల మధ్య దూరం, వాహనాల రాకపోకల సంఖ్య, టోల్ వసూలు కాంట్రాక్టు వ్యవధి ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఛార్జీల పెంపుదలను లెక్కిస్తారు. రాష్ట్రం మీదుగా వెళ్లే ఏడు జాతీయ రహదారుపై 29 టోల్‌ప్లాజాలు ఉన్నాయి.