భాగ్యనగరంలో 30 వేల వరకు పెంపుడు కుక్కలు ఉన్నట్లు అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో నగరంలో ఎక్కువ సంఖ్యలో గ్రూమింగ్ కేంద్రాలు వెలిశాయి. మనుషుల్లాగే వీటికి ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఇంటికే వచ్చి శునకాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. నగరంలో పెట్‌గ్రూమింగ్ మార్కెట్ గత ఏడాదితో పోల్చితే 20 శాతం పెరిగింది.
గ్రూమింగ్ అంటే..
మనుషులకు బ్యూటీ పార్లర్‌లు ఎలాగో.. కుక్కలకు గ్రూమింగ్ కేంద్రాలు అలాగ. కుటుంబ సభ్యుల్లాగా భావించే యజమానులు వాటిని అందంగా ముస్తాబు చేసేందుకు వేలాది రూపాయలు గ్రూమింగ్ కేంద్రాల్లో ఖర్చు చేస్తున్నారు. వాటి ఆహారం, ఆరోగ్యంతోపాటు అందంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నెయిల్ కటింగ్, బేసిక్ బాత్, టీత్ బ్రషింగ్, హెయిర్‌కట్ తదితరాలకు కలిపి నగరంలోని ప్రముఖ కేంద్రాల్లో సుమారు రూ.3,000 వరకు తీసుకుంటున్నారు. అమీర్‌పేట్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, మియాపూర్, తిరుమలగిరి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో పెట్‌గ్రూమింగ్ కేంద్రాలు వెలిశాయి.
నెలకు రూ.50 వేల వరకు సంపాదన
శునకాల ఆరోగ్యం, వ్యాయామం, ఆహారం తదితరాల్లో నాణ్యమైన వాటికే ప్రాధాన్యం ఇస్తుంటారు. పనిమీద వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే వాటిని డాగ్ హాస్టల్స్‌లో ఉంచుతున్నారు. ఇప్పటికే కుక్కల కోసం కార్పొరేట్ ఆసుపత్రులు, కేర్ సెంటర్లు వెలిశాయి. కొన్ని సంస్థలు సర్వీస్ ఆన్ వీల్స్ పేరుతో ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇంటింటికీ ప్రత్యేక వాహనంలో వెళ్లి వాటికి సేవలు అందిస్తున్నారు. గ్రూమింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని.. రాణిస్తున్న వారు నెలకు సుమారు రూ.50 వేల వరకు సంపాదిస్తున్నారు.